బీటెక్ రవి అరెస్ట్.. జగన్ కక్ష సాధింపే: సీఎంపై బాబు ఆరోపణలు

By Siva KodatiFirst Published Jan 3, 2021, 4:34 PM IST
Highlights

టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్‌పై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిటెక్ రవి అరెస్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్షసాధింపు చర్యగా ఆయన అభివర్ణించారు

టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్‌పై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిటెక్ రవి అరెస్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్షసాధింపు చర్యగా ఆయన అభివర్ణించారు.

నెల రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో ఎస్సీ మహిళ హత్యాచారం దుర్ఘటన వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ దుర్ఘటనకు కారకులైన నిందితులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. దీనిని వెలుగులోకి తెచ్చిన టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు.

ఎస్సీలపై, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి చట్టం కింద కేసులు పెట్టడం మరో దుర్మార్గ చర్య అంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో చట్టబద్ద పాలన (రూల్ ఆఫ్ లా) లేదనడానికి ఇదే తార్కాణమన్నారు.

ఎస్సీ ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి ఇది పరాకాష్టగా ప్రతిపక్షనేత అభివర్ణించారు. ‘‘ఛలో పులివెందుల’’ కార్యక్రమం నిర్వహించారన్న అక్కసుతోనే టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ నిర్బంధాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

బాధితులకు అండగా ఉండటం టీడీపీ నాయకుల నేరమా..? నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరడం అపరాధమా అని ఆయన ప్రశ్నించారు. ఎస్సీలపై దమనకాండకు పాల్పడేవాళ్లపై చర్యలు తీసుకోరా..?  నెలరోజుల క్రితం ఎస్సీ మహిళపై హత్యాచారానికి పాల్పడిన వాళ్లపై ఇంతవరకు చర్యలు తీసుకోరా..? అని చంద్రబాబు నిలదీశారు.

దీనిని నిలదీసిన వాళ్లపై అక్రమ కేసులు బనాయిస్తారా...? ఈ దుశ్చర్యలవల్లే నేరగాళ్లు ఇంకా చెలరేగి పోతున్నారని టీడీపీ అధినేత వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో నిందితులు నిర్భీతిగా తిరుగుతున్నారు. 

బాధితులపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. అదేమని ప్రశ్నించిన గొంతులను నొక్కేస్తున్నారని ప్రజల ప్రాధమిక హక్కులను కాలరాస్తున్నారని ప్రతిపక్షనేత ఎద్దేవా చేశారు.

ఈ దుర్మార్గ చర్యలను ప్రజలంతా గర్హించాలని.. వైసిపి ప్రభుత్వ దమనకాండను అన్ని వర్గాల ప్రజలు నిరసించాలని ఆయన పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

click me!