హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఆయనతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. సీట్ల పంపకాలుపైనే ప్రధానంగా భేటీ జరుగుతున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్‌పై విడుదల కావడంతో తిరిగి రాజకీయంగా యాక్టీవ్ అవుతున్నారు. ఎన్నికలకు మూడు నెలలకు మించి సమయం లేకపోవడంతో పొత్తులు, సీట్ల ఖరారు, ప్రచారం, అభ్యర్ధుల ఎంపిక, నిధుల సమీకరణపై చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు జైలుకు వెళ్లడంతో తదుపరి కార్యక్రమాల్లో ముందడుగు పడలేదు. ఇప్పుడు పరిస్ధితులు కుదటపడటంతో జనసేనతో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై టీడీపీ చీఫ్ ఫోకస్ పెట్టారు.
దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఆయనతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లుగా సమాచారం. సీట్ల పంపకాలుపైనే ప్రధానంగా భేటీ జరుగుతున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. 40 నుంచి 42 వరకు పవన్ కళ్యాణ్ సీట్లు అడుగుతుండగా.. 25 నుంచి 30 వరకు ఇచ్చేందుకు టీడీపీ అంగీకారం తెలిపినట్లుగా ఆ కథనాల సారాంశం. అసెంబ్లీ స్థానాలతో పాటు 5 పార్లమెంట్ స్థానాలను జనసేనాని తమకు ఇవ్వాలని కోరుతుండగా.. టీడీపీ మాత్రం 2 ఇచ్చేందుకు సుముఖంగా వున్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ చివరి నాటికి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ఇద్దరు నేతలు భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేసేందుకు కూడా ఇరు పార్టీలు కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. తటస్థులు , వైసీపీ నేతలు జనసేనలో చేరికపైనా చంద్రబాబు, పవన్‌లు చర్చించారు. సమన్వయ కమిటీ సమావేశంలో వచ్చిన ఫీడ్ బ్యాక్ , ఉమ్మడి మేనిఫెస్తో విడుదలపైనా నిర్ణయాలు తీసుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. త్వరలో రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఉమ్మడిగా బహిరంగ సభల నిర్వహణపైనా నిర్ణయించారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికలు, ఫలితాలపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది.