ఒకే రోజు రెండుసార్లు చంద్రబాబు, పవన్ భేటీ ... అయినా ఆ విషయంలో నో క్లారిటీ?

By Arun Kumar PFirst Published Feb 5, 2024, 7:24 AM IST
Highlights

అధికార వైసిపి దూకుడుగా ముందుకు వెళుతూ ఇప్పటికే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. ఈ నేపథ్యంలో టిడిపి-జనసేన కూటమి కూడా దూకుడు పెంచింది.

అమరావతి : ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో టిడిపి‌-జనసేన కూటమి స్పీడ్ పెంచింది. ఇరుపార్టీల పొత్తు ఎప్పుడో ఖరారవగా తాజాగా సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక, ఉమ్మడి మేనిఫెస్టో తదితర అంశాలపై కసరత్తు జరుగుతోంది. వీటిగురించి చర్చించేందుకు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యారు. ఇక నిన్న(ఆదివారం) ఒక్కరోజే ఈ ఇద్దర నేతలు రెండుసార్లు భేటీ అయ్యారు.  

ఆదివారం మధ్యాహ్నం స్వయంగా కారు నడుపుకుంటూ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు పవన్ కల్యాణ్. ఆయనకు చంద్రబాబు, అచ్చెన్నాయుడు తదితర టిడిపి నాయకులు సాదరస్వాగతం పలికారు. వివిధ అంశాలపై చంద్రబాబు, పవన్ 3 గంటలపాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటు అంశంపైనే ఇద్దరు నేతల మధ్య ఎక్కువ చర్చ జరిగినట్లు ఇరుపార్టీల నాయకులు చెబుతున్నారు. 

Latest Videos

అయితే ఇతర కార్యక్రమాలు వుండటంతో మధ్యాహ్నం భేటీని అర్ధాంతరంగా ముగించి తిరిగా రాత్రి మరోసారి కలుసుకున్నారు చంద్రబాబు, పవన్. ఈ క్రమంలోనే ఏ పార్టీకి ఎన్నిసీట్లు,  పోటీచేసే అభ్యర్థుల ఎంపిక, బిజెపితో పొత్తు వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై ఓ క్లారిటీకి వచ్చిన నేతలు మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 8న భేటీ అయి సీట్ల సర్దుబాటు, ఏ పార్టీ ఎక్కడ పోటీచేయాలి,  ఉమ్మడి మేనిఫెస్టో తదితర అంశాలపై ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. ఓ స్పష్టత వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్ మీడియా సమావేశం ఏర్పాటుచేసి అన్ని విషయాలు వెల్లడించే అవకాశాలున్నట్లు ఇరుపార్టీల నాయకులు చెబుతున్నారు. 

Also Read  బీజేపీ కోసం పవన్ చివరి యత్నాలు .. కలిసొస్తే సరే, లేకుంటే ఈ నెల 14న టీడీపీ జనసేన తొలి అభ్యర్ధుల జాబితా ..?

 సీట్ల సర్దుబాటు తర్వాత జనసేన పోటీచేసే స్థానాల్లో టిడిపి, తెలుగుదేశం పోటీచేసే స్థానాల్లో జనసేన ఆశావహులను ఆ పార్టీ అదిష్టానం బుజ్జగించనుంది. సీట్ల పంపకాలు ఇరు పార్టీలకు నష్టం జరక్కుండా వుండేలా అశావహులకు భవిష్యత్ అవకాశాలపై హామీ ఇవ్వనున్నారు. ఇలా టిడిపి-జనసేన కూటమి పక్కా ప్రణాళికతో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. 

ఇక తాజా భేటీలో చంద్రబాబు, పవన్ మధ్య  సీట్ల పంపకాలపై ఆసక్తికర చర్చ జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. జనసేనకు 28 సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే జనసేనాని మాత్రం 45 సీట్లు కావాలని అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఉభయగోదావరి, విశాఖ, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ సీట్లను పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నట్లుగా సమాచారం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 2 నుంచి 3 సీట్లను తమకు కేటాయించాలని జనసేనాని పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది. 

ఈ నెల చివరి వారం నాటికి టీడీపీ, జనసేన పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి నుంచి ఇరు పార్టీల నేతలు, కేడర్ ప్రచారంలో దూసుకుపోవాలని ఇద్దరు నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో మరోసారి భేటీ కావాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 


  

click me!