నా తండ్రి హత్య గురించి మాట్లాడితే బెదిరిస్తున్నారు: వైఎస్ వివేకా కూతురు సునీత

By narsimha lodeFirst Published Apr 2, 2021, 3:27 PM IST
Highlights

:తన తండ్రి హత్య కేసు గురించి మాట్లాడితే బెదిరిస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు.


న్యూఢిల్లీ:తన తండ్రి హత్య కేసు గురించి మాట్లాడితే బెదిరిస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు.శుక్రవారం నాడు  వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత న్యూఢిల్లీలో సీబీఐ అధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

నాన్న హత్య తమ అందరినీ షాక్‌కు గురి చేసిందని ఆమె చెప్పారు.రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తమకు న్యాయం జరగలేదని ఆమె కుండబద్దలుకొట్టారు.వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి రెండేళ్లు దాటినా ఎవరు హత్య చేశారో ఇప్పటికి తెలియరాలేదన్నారు.ఇప్పటివరకు దోషులను పట్టుకోలేకపోవడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

తాను  సీబీఐ సీనియర్ అధికారిని కలిసిన సమయంలో కడపలో ఇలాంటి ఘటనలు సాధారణమని చెప్పడం తనకు ఆశ్చర్యం కల్గించిందన్నారు.ఇలా ఎలా మాట్లాడుతారని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు తనకు బాధ కల్గించాయన్నారు.మా నాన్నను చంపిన దోషుల్ని పట్టుకోకపోతే ఈ సంస్కృతి ఇలాగే పెరిగిపోతోందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మాజీ సీఎం సోదరుడి హత్య కేసులో నిందితులను పట్టులేకపోవడం దారుణమన్నారు.

తన తండ్రి చాలా సున్నితమైన మనసు కలవాడని ఆమె గుుర్తు చేసుకొన్నారు. ఆయన ఎలాంటివారో అందరికి తెలుసునని చెప్పారు.  కడప ప్రాంతానికి తన తండ్రి ఎంతో సేవ చేశారని ఆమె గుర్తు చేసుకొన్నారు. మాకే న్యాయం జరగకపోతే సామాన్యుడి పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు.వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ సరిగా జరగడం లేదన్నారు. 

ఈ కేసు విచారణ ఎంత ఆలస్యమైతే న్యాయం అంత దూరం జరిగినట్టేనని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కేసులో ఇంకెందరు సాక్షులు చనిపోతారోననే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. న్యాయం కోసం ఇంకా ఎంతకాలం ఎదురుచూడాలని ఆమె ప్రశ్నించారు.ఓ మనిషి ప్రాణం తీయడం సర్వసాధారణం ఎలా అవుతోందన్నారు. 
 

click me!