ఎన్టీఆర్ పాలనలో కూడా శాసన మండలిని రద్దు చేశారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనపై ఆయన స్పందించారు. కృత్రిమ ఉద్యమాలపై తాను మాట్లాడబోనని చెప్పారు.
విశాఖపట్నం: తాను కృత్రిమ ఉద్యమాల గురించి మాట్లాడదలుచుకోలేదని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శుక్రవారం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపించామని, కేంద్రానికి ఉన్న ప్రొసీజర్స్ ప్రకారమే అన్నీ జరుగుతాయని ఆయన అన్నారు.
శాసన మండలిని రద్దు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయం తెలిసిందే. కేంద్రం ఆమోదిస్తే శాసన మండలి రద్దవుతుంది.
undefined
చట్టం ఎవరికీ చుట్టం కాదని, అన్ని చట్టప్రకారంగా అన్నీ జరుగుతాయని ఆయన అన్నారు.ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా మండలి రద్దు చేయడం జరిగిందని చెప్పారు. రాయల్ రాజధాని ప్రాంత రైతులతో ప్రభుత్వం వేసిన కమిటీ మాట్లాడుతుందని చెప్పారు.
రైతులతో పాటు రైతు కూలీలు కూడా పెన్షన్ అందజేస్తామని శాసనసభ వేదికగా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు..కృత్రిమ ఉద్యమాల గురించి తాను మాట్లాడబోనని ఆయన అన్నారు. నిజంగా ప్రజల ఉద్యమం జరిగితే దానికి అందరూ మద్దతు ఇద్దామని ఆయన అన్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దని జరుగుతున్న ఆందోళనలపై ఆయన ఆ విధంగా స్పందించారు.
విశాఖపట్నం విమానాశ్రయంలో తమ్మినేని సీతారాంకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.