జగన్ మూడు రాజధానుల ఆలోచనను ఆర్ఎస్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడు రాజధానుల అంశాన్ని ఆర్ఎస్ఎస్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆర్ఎస్ఎస్ తన పత్రిక ఆర్గనైజర్‌లో వ్యాసాన్ని ప్రచురించింది.
మూడు రాజధాలను అంశాన్ని ఏపీకి చెందిన టీడీపీ,బీజేపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఈ తరుణంలో ఆర్ఎస్ఎస్ తన అధికారిక పత్రిక ఆర్గనైజర్‌లో ఈ అంశం ప్రస్తావించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.
undefined
Also read:ఆ నగరం దేశ రాజధానిగా ఓకే... రాష్ట్ర రాజధానిగా మాత్రం పనికిరాదట...: ఏపి డిప్యూటీ సీఎం
జమ్మూ కాశ్మీర్ పునర్వవ్యస్థీకరణ నేపథ్యంలో 2019 నవంబర్ 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం అధికారికంగా భారత రాజకీయ మ్యాప్ ను విడుదల చేసింది. అందులో రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని నగరంపై గెజిట్ నోటిపికేషన్ జారీ చేయలేదు. టెక్నికల్ అంశాన్ని వైఎస్ జగన్ తనకు అనుకూలంగా మార్చుకొన్నారు. మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చి ప్రజల జీవితాలతో ఆడుకొంటున్నారని ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్‌లో ప్రచురించిన వ్యాసంలో పేర్కొన్నారు.
వాస్తవ విరుద్దమైన ఆచరణ సాధ్యం కాని ఈ నమూనాను రాష్ట్రంలోని పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయని ఆ వ్యాసంలో ప్రస్తావించారు. నెల రోజులుగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
ఈ ఆందోళనలను పట్టించుకోకుండా అసెంబ్లీలో తనకున్న మెజారిటీతో బలవంతంగా సదరు బిల్లుకు ఆమోదముద్ర వేయించుకొన్నారు. రాష్ట్ర విస్తీర్ణం తక్కువే. అయితే శాసనసభ రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్టణం, న్యాయ రాజధానిగా కర్నూల్ ను ప్రకటించారు.
ఈ మూడు నగరాలకు మధ్య పరస్పరం 600 కి.మీ. దూరం ఉంది. ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు సేవలు అందించారు. ఒకటి కన్నా ఎక్కువ రాజధానులను పెట్టాలన్న ఆలోచనను ఎవరూ చేయలేదన్నారు.
అమరావతిని రాజధాని నగరంగా ప్రధాని మోడీ ప్రకటించారు. నగర నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేశారు. ప్రధాన భవనాల నిర్మాణం కోసం రూ. 2500 కోట్లను కేంద్రం విడుదల చేసింది.అమరావతిలో శాసనసభ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు భవనాలు ఉన్న విషయాన్ని ఆ వ్యాసంలో ప్రస్తావించారు.
అమరావతిలో నగరంలో మౌళిక వసతుల కోసం ఇప్పటికే రూ. 10 వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఒక వాస్తవిక అంచనా ప్రకారం ఈ నగరానికి రాజధాని శోభ రావాలంటే మరో రూ. 5 వేల కోట్లు అవసరమని చెప్పారు.
అమరావతి నుండి రాజధానిని మార్చాలన్న జగన్ నిర్ణయంతో మూడు చోట్ల సౌకర్యాల కల్పనకు రూ. 3 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. గత ఆరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ కు రెవిన్యూ లోటు ఉంది. రూ. 2.50 లక్షల కోట్లు రుణ భారాన్ని రాష్ట్రం మోస్తోంది. సామరస్య రాజకీయాలకు జగన్ విరుద్దమని ఈ వ్యాసకర్త ప్రస్తావించారు.
రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతూ చంద్రబాబుతో ఉన్న రాజకీయ విబేధాలకే ఆయన ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ఉన్న పళంగా రాజధానిని మార్చడానికి ఇంతకన్నా కారణాలేమీ కన్పించడం లేదన్నారు.
ఎన్నికల ప్రణాళికలోనూ జగన్ మూడు రాజధానుల హామీని ఇవ్వలేదన్నారు. పైగా వైసీపీ గెలిస్తే రాజధానిని తరలించేస్తారని ఎన్నికల సమయంలో వచ్చిన వదంతులను జగన్ సహా ఆ పార్టీ నేతలంతా ఖండించారని ఆ వ్యాసంలో ఖండించారు.
రాజధానిగా అమరావతి కొనసాగుతోందని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మాట తప్పడం తన స్వభావం కాదన్న జగన్ చేతిలో మోసపోయామన్న బాధ సహజంగానే ప్రజల్లో వ్యక్తమైందని ఆ వ్యాసంలో వ్యాసకర్త అభిప్రాయపడ్డారు.
అమరావతిలో టీడీపీ నేతలు ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ నేతలు చేస్తున్న వాదనల్లో వాస్తవం లేదన్నారు. అమరావతికి వరద ముప్పు ఉందని చెప్పడం సరైందికాదన్నారు.
ఈ క్రమంలోనే మూడు రాజధానుల అంశాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమర్ధించుకొన్నారని ఆయన ఈ వ్యాసంలో అభిప్రాయపడ్డారు. అమరావతిని అభివృద్ది చేసేందుకు లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని జగన్ చేస్తున్న విషయాన్ని వ్యాసంలో ప్రస్తావించారు.
నగరాలు రాత్రికి రాత్రే అభివృద్ధి చెందవన్నారు. దేశంలోని నగరాలన్నీ చిన్నస్థాయి నుండే అభివృద్ధి చెందుతున్నాయన్నారు. రాజధాని అభివృద్ధికి యుక్తితో కూడిన ప్రణాళిక ఒక్కటి చాలన్నారు.
మూడు రాజధానుల మధ్య పంపకం చేయడం వల్ల అంతిమంగా ఏ ఒక్క నగరానికి ఊతం లభించదన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొన్ని శతాబ్దాల కింద మహ్మద్ బిన్ తుగ్లక్ తన రాజధానని మార్చిన ఉదంతాన్ని గుర్తు చేసుకొంటున్నారు.
అలాగే జగన్, తుగ్లక్ పేర్లను జోడించి జగ్లక్ అనే కొత్త పేరును తెరమీదికి తెచ్చినట్టుగా ఆ వ్యాసంలో ప్రకటించారు. స్థానిక రాజకీయాల సంగతి అటుంచితే ఈ వ్యవహరంలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జగన్‌కు సరైన సలహా ఇచ్చి సరైన దారిలో పెట్టాల్సిన అవసరం ఉందని ఆ వ్యాసంలో పేర్కొన్నారు.