అమరావతి- పైన ఇలా... లోన ఎలా?

Published : Feb 22, 2017, 12:26 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
అమరావతి- పైన ఇలా... లోన ఎలా?

సారాంశం

స్ఫూర్తి సింగపూరే అయినా సారం తెలుగేనట

అమరావతి ఒకటి కాదు, పది నగరాలట... తొందరల్లో వాటికి కూడా మంచిపేర్లు వస్తాయి.వాటికోసం తెలుగు చరిత్రలో అన్వేషణ మొదలయింది.

 

అమరావతిని తెలుగు సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపదలకు ప్రతిబింబంలా తీర్చిదిద్దడానికి  నిర్మాణ రీతులన్నింటినీ క్రోడీకరించాలని డాక్టర్ పరకాల ప్రభాకర్ సారధ్యంలోని నిపుణుల  కమిటీ నిర్ణయించింది.  

 

ఈ విజయవాడలో రెండురోజులపాటు సమావేశాలు నిర్వహిస్తోంది. తొలిరోజు సమావేశం విజయవాడలోని సీఆర్‌డీఏ సమావేశ మందిరంలో డాక్టర్ పరకాల అధ్యక్షతన జరిగింది.

 

అమరావతి  నవ నగర సమాహారంగా వుంటుంది. ఈ  అమరావతికి నగర ముఖద్వారాలు ఎలా వుండాలి? నిర్మాణ శిల్పం ఎలా అమరాలి? నిర్మాణశైలిలో మన సంస్కృతి, వారసత్వ సంపద, చరిత్రలను ఎలా నిక్షిప్తం చేయాలనే అంశంపై ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది.

 

9 నగరాల్లో ఒక్కో నగరానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటికి పేర్లను తొందర్లో నిర్ణయిస్తారు.

 

భారతీయ సంస్కతి, ముఖ్యంగా ఆంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మాణశైలి వుండాలని ఈ సమావేశంలో ఏకాభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

 

రాజధానికి దారితీసే రహదారులకు, భారీ భవంతులకు, ఇతర ముఖ్య కట్డడాలకు మన చరిత్రను స్ఫూరించేలా తగిన నామకరణం చేయాలని కూడా సమావేశం అభిప్రాయపడింది.ప్రధాన భవనాల గోపురాలు సాంచీ స్థూపంలా ఉంటే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తెలుగునాట విలసిల్లిన అన్ని పూర్వ రాజ్యాల నిర్మాణ రీతులు మన అమరావతి నిర్మాణంలో అంతర్భాగం కావాలని ఈ సమావేశం ఏకాభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. 

 

రాజధానిలో వృక్షాల పెంపకం సైతం శాస్త్రీయంగా జరపాలని, మన వాతావరణానికి అనుగుణంగా ఔషధ విలువలు కలిగిన, పర్యావరణ హితమైన వృక్షాలు పెంచాలని ఒక సూచన వచ్చింది.

 

 వేప, కానుగ, కుంకుడు, తుమ్మ, నల్లమద్ది తదితర ఔషధ విలువలు గల వృక్షజాతులు పెంచాలన్నారు. భూసారాన్ని నాశనం చేసే విదేశీ జాతులు హానికరమని చెప్పారు.

 

 శాలవృక్షం, అర్జున వృక్షం, పనస, మామిడి, కానుగ, వేప, వెలగ చెట్టు తదితర వృక్షాలను ఎక్కడెక్కడ నాటాలనే దానిపై శాస్త్రీయపద్ధతిలో నిర్ణయాలు తీసుకోవాలని, ఇతర దేశాల నుంచి వచ్చి మన అడవుల్ని నాశనం చేస్తున్న వృక్ష జాతుల్ని సమూలంగా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా సర్కారీ తుమ్మ చెట్టు ఆనవాళ్లు ఎక్కడా లేకుండా చేయాలని,.

 

ఈ ప్రాంత ఉష్ణోగ్రతలను దృష్టిలో వుంచుకుని ఎక్కడికక్కడ వాటర్ ఫౌంటెయిన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

 

రహదారి కూడళ్లలో రాతి నిర్మాణాలు వుంటే కళ్లకు ఇంపుగా వుంటాయనే భావన వ్యక్తమైంది. ప్రభుత్వ కార్యాలయాలు మన ప్రాచీన సంప్రదాయరీతిలో మండువా లోగిలి ఆకృతిలో ఉంటే గాలి, వెలుతురు ధారాళంగా వుంటాయని సమావేశంలో తిరుపతి శ్రీ వేంకటేశ్వర మ్యూజియం డైరెక్టర్ వి రంగనాయకులు సూచించారు.

 

పరిపాలన భవనాలకు చారిత్రక నామాలు పెట్టాలని ప్రతిపాదించారు. చరిత్ర పురుషుల పేర్లు పెట్టాలని కూడా మరొకరు చెప్పారు.50, 100 ఏళ్ళ తర్వాత కూడా అమరావతి నిర్మాణం గురించి గొప్పగా రాయగలిగేలా ఉండాలన్నారు.

 

రాష్ట్రం ఏ మూల నుంచి వచ్చిన వారైనా ఇది మన ఊరు అని భావించేలా అమరావతి ఉండాలని అభిప్రాయపడ్డారు. శాసనసభ భవంతి చంద్రగిరి కోట రాజమహల్ శైలిలో వుంటే బావుంటుందని కొందరు సూచించారు. ఉండవల్లి గుహలకు వున్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో వుంచుకుని దాన్ని సంరక్షణ చర్యలు చేపట్టి పునర్నిర్మాణం జరపాలని సూచించారు.

 

శతాబ్దాల చరిత్ర కలిగిన అమరావతిని అనేక శాతవాహనులు, ఇక్ష్వాకులు, శాలంకాయనులు సహా అనేక రాజవంశాలు పరిపాలించాయని, అలాగే, కొద్ది కాలం పాటు బౌద్ధం విలసిల్లిందని, ఆ సంస్కృతి, సంప్రదాయాలన్నీ నిర్మాణ శైలిలో ప్రతిఫలించాలని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కిరణ్ క్రాంత్ చౌదరి చెప్పారు.

 

ప్రజా రాజధాని అనే పేరుకు అచ్చమైన అర్ధంలా రూపొందించాలని అన్నారు. రాజధాని నిర్మాణంలో ఉపయోగించే రాయి వగైరా మన ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందినదై వుంటే ప్రజలు ఇది తమ సొంతమనే భావనతో వుంటారని అన్నారు.

 

బుద్దిజం ఆనవాళ్లు కొత్త భవంతుల ఫ్రంట్ ఎలివేషన్‌లో ప్రతిబింబించాలని ఆర్కియాలజీ రిటైర్డ్ అధికారి కేవీ రావు కోరారు. 

 

నగరం మొత్తం ఒకే ఒకే వర్ణంలో వుంటే అద్భుతంగా వుంటుందని సినీ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి చెప్పారు.

 

ఆంధ్ర చరిత్ర అంటే అందులో ఉత్తరాంధ్ర చరిత్ర ఉండటం లేదని, కొత్త రాజధానిలోనైనా కళింగ సామ్రాజ్యపు ఆనవాళ్లు వుంటే న్యాయం చేసినట్టు అవుతుందని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ విజయభాస్కర్ అన్నారు. నాలుగైదు బౌద్ధ జాతక కథలలో కళింగ పట్టణం ఓడరేవు ప్రస్తావన వుందని గుర్తుచేశారు. కళింగం అంటే ఒకనాడు గంగ నుంచి గోదావరి వరకు వుండేదని, ఇప్పుడది మూడు జిల్లాలకు పరిమితమైపోయిందని ఆవేదన వెలిబుచ్చారు. కొత్త రాజధానిలో కళింగ సంస్కృతి, వారసత్వం కనిపించాలని చెప్పారు.

 

  తెలుగు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సంస్కృతిని కొత్త రాజధాని నిర్మాణం ప్రతిఫలించాలని చరిత్రకారుడు ఈ శివనాగిరెడ్డి అన్నారు. చరిత్రలో చిన్నచిన్న తెలుగు సామ్రాజ్యాలు అనేకం వున్నాయని, ఆయా సంస్కృతులన్నీ రాజధానిలో ఎక్కడో అక్కడ కనిపించేలా నిర్మాణాలు చేయాలని చెప్పారు.

 

  ఇక్కడ తీసుకున్న నిర్ణయాలను త్రిడీ మోడల్ నమూనా చిత్రాలుగా రూపొందించి వాటిని నార్మన్ ఫోస్టర్ సంస్థకు అందించాలని అమరావతి హెరిటేజ్ సిటీ సలహాదారు గల్లా అమరేశ్వర్ చెప్పారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?