తాడికొండ వైసీపీలో ముదిరిన ఆధిపత్య పోరు.. శ్రీదేవి, డొక్కా వర్గీయుల పోటాపోటీ ర్యాలీలు

By Sumanth KanukulaFirst Published Aug 27, 2022, 12:51 PM IST
Highlights

తాడికొండ వైసీపీలో ఆధిపత్య పోరు మరింతగా ముదిరింది. స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి  శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అనుచరులు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించారు.

తాడికొండ వైసీపీలో ఆధిపత్య పోరు మరింతగా ముదిరింది. తాడికొండ నియోజకవర్గం వైసీపీ అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌‌ను నియమించడంపై స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దక్కదేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ నియమాకాన్ని ఉండవల్లి శ్రీదేవి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె అనుచరులు గత కొద్ది రోజులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. 

అయితే ఈ రోజు ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అనుచరులు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించారు. డొక్కాకు వ్యతిరేకంగా శ్రీదేవి అనుచరులు నినాదాలు చేయగా.. మరోవైపు శ్రీదేవికి వ్యతిరేకంగా డొక్కా‌ వర్గీయులు నినాదాలు చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలతో చర్చలు ప్రారంభించారు. అయితే వెనక్కి తగ్గేందుకు ఇరువర్గాలు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే ఇరువర్గాలు కూడా తమను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో తాడికొండలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

అయితే పోలీసులు మాత్రం ఇరువర్గాలకు ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. తాడికొండలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. 

ఇదిలా ఉంటే.. వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ప్రకారం తాము నడుచుకుంటామని డొక్కా అనుచరులు చెబుతున్నారు. ఎలాంటి విభేదాలు లేకుండా పార్టీని బలోపేతం చేస్తామని డొక్కా చెప్పుకొచ్చారు. వైసీపీలో గ్రూపు రాజకీయాలకు తావు లేదని అన్నారు. తాడికొండలో తనను అదనపు సమన్వయకర్తగా నియమించే విషయం నియామకం చేపట్టేవరకు తనకు తెలియదని డొక్కా అన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి కొంత బాధతో ఉన్నారని.. ఆమె మాట్లాడి కలిసి పనిచేస్తామని మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. ఇక, గ్రూపులు లేవని డొక్కా చెబుతున్నప్పటికీ.. ఆయన వచ్చే ఎన్నికల్లో తాడికొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలవాలని చూస్తున్నారనే  ప్రచారం సాగుతుంది. 

click me!