
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు కుప్పానికి వచ్చిన ప్రతీసారి బ్లాక్ డే అంటూ విమర్శించారు. చంద్రబాబు మళ్లీ కుప్పంలో గెలిచేది కల మాత్రమేనని అన్నారు. కుప్పంలో తమ పార్టీ వాళ్లు ఎంతో మంది గాయపడ్డారని చెప్పారు. వైసీపీ వాళ్లు దౌర్జన్యం చేస్తున్నారని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే రండి అంటూ చంద్రబాబు రెచ్చగొట్టేలా పిలుపునిచ్చారని అన్నారు. 33 ఏళ్ల పాటు కుప్పం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఏం చేశారని ప్రశ్నించారు.
చంద్రబాబుకు మానసిక స్థితి బాగోలేదని విమర్శించారు. కుప్పంలో ఇక గెలవలేమనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కుప్పంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనేలా టీడీపీ ప్లాన్ చేసిందని.. బయటి నుంచి జనాలను తీసుకొచ్చి దాడులు చేశారని ఆరోపించారు. రాయలసీమకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. కుప్పం ప్రజలు చంద్రబాబును ఎప్పుడో వదిలేశారని అన్నారు. ఎన్నికలలోపే కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేస్తామని చెప్పారు.