స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం: వెలుగు చూస్తున్న రమేష్ ఆస్పత్రి లీలలు

By telugu teamFirst Published Aug 14, 2020, 2:37 PM IST
Highlights

స్వర్ణ కోవిడ్ సెంటర్ నిర్వహణలో రమేష్ ఆస్పత్రి యాజమాన్యం అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. రమేష్ అస్పత్రి యజమాని డాక్టర్ రమేష్ బాబు నాలుగు రోజులుగా అజ్ఢాతంలో ఉన్నారు.

విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ లో కరోనా కేర్ సెంటర్ ను నిర్వహించే విషయంలో రమేష్ ఆస్పత్రి లీలలు ఒక్కటొక్కటే వెలుగు చూస్తున్నాయి. నిబంధనలను ఎక్కడికక్కడ ఉల్లంఘించినట్లు విచారణలో బయటపడుతోంది. కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహణకు ప్రభుత్వం జులై 18వ తేదీన అనుమతి ఇచ్చింది. దానికి వారం రోజుల ముందు నుంచే స్వర్ణ ప్యాలెస్ లో రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.

స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ లో 30 మంది రోగులకు మాత్రమే చికిత్స అందించాలని నిర్దేశించగా 43 మంది రోగులకు చికిత్స అందించినట్లు తెలుస్తోంది. దానికితోడు, అనుమతి లేకుండా మరో రెండు హోటళ్లలో కూడా రోగులను చేర్చుకుని చికిత్స అందించినట్లు బయపడింది. స్వర్ణ కోవిడ్ కేర్ సెంటర్ పేరు మీద ఆ రెండు హోటళ్లలో రోగులను చేర్చుకున్నట్లు సమాచారం. దాంతో ఆ రెండు హోటళ్ల యాజమాన్యాలకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేయడానికి సిద్ధపడుతున్నారు. 

రమేష్ ఆస్పత్రి యజమాని రమేష్ బాబు గత నాలుగు రోజులుగా అజ్ఢాతంలో ఉన్నారు. స్వర్ణ ప్యాలెస్ నిర్వహణ బాధ్యత తమది కాదని ఆయన ఓ వీడియో ద్వారా తెలియజేశారు. అయితే, రమేష్ ఆస్పత్రి యాజమాన్యం ఇప్పటి వరకు స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యంతో చేసుకున్న ఒప్పంద పత్రాన్ని దర్యాప్తు అధికారులకు అందించలేదు. 

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు మాజీ పార్లమెంటు సభ్యుడు, టీడీపీ నేత రాయపాటి సాంబశివ రావు కోడలు మమతను విచారిస్తున్నారు. మమతకు రెండు రోజుల క్రితం విజయవాడ పోలీసులు నోటీసు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో సూచించారు. 

అందులో భాగంగా శుక్రవారం ఉదయం విజయవాడ నుంచి రాయపాటికి ఇంటికి వెళ్లిన పోలీసులు మమతను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విజయవాడకు తీసుకుని వెళ్లి విచారిస్తున్నారు. స్వర్ణ ప్యాలెస్ లో అగ్ని ప్రమాదం సంభవించి కోవిడ్ రోగులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. రమేష్ ఆస్పత్రికి చెందిన రమేష్ బాబు పరారీలో ఉన్నారు. 

పోలీసుల తీరును రాయపాటి సాంబశివ రావు కుమారుడు రంగారావు ఖండించారు. మమత గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో పనిచేస్తోందని, విజయవాడలో జరిగిన ప్రమాదానికి ఏ విధమైన సంబంధం ఉంటుందని ఆయన అన్నారు. ప్రభుత్వం తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుందని ఆయన అన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మమతను ఇబ్బంది పెడుతున్నారని ఆయన అన్నారు. 

మమత ఇటీవల కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నట్లు తెలుస్తోంది. రమేష్ ఆస్పత్రి నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్నిప్రమాదం సంభవించి పది మంది మరణించారు, మరికొంత మంది గాయపడ్డారు. 

click me!