మంత్రివర్గ సమావేశం నిర్వహణకు అనుమతి కోరుతూ సమావేశం ఎజెండాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) గోపాలకృష్ణ ద్వివేదికి పంపించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 14వ తేదీన తలపెట్టిన మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల కమిషన్ (ఈసీ) నుంచి ఇప్పటి వరకు అనుమతి రాలేదు. దీంతో మంగళవారం జరగాల్సిన మంత్రివర్గం సమావేశం జరుగుతుందా, లేదా అనుమానాలు నెలకొన్నాయి.
మంత్రివర్గ సమావేశం నిర్వహణకు అనుమతి కోరుతూ సమావేశం ఎజెండాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) గోపాలకృష్ణ ద్వివేదికి పంపించారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం దానిని ఈసీకి నివేదించారు. ఆదివారం రాత్రి వరకు కూడా ఈసీ నుంచి ఏ విధమైన సమాచారం రాలేదు.
నిబంధనల ప్రకారం ఈసీ అనుమతికి కనీసం 48 గంటల ముందు అభ్యర్థనను పంపించాలి. ఆదివారం సాయంత్రానికి 48 గంటలు ముగిసింది. సోమవారం ఈసీ నుంచి సమాచారం రావచ్చునని అంటున్నారు. ఆదివారం ఆరో విడత పోలింగ్ జరగడంతో సిబ్బంది తీరిక లేకుండా ఉన్నారని, అందువల్ల సోమవారం దానిపై ఈసి స్పందించే అవకాశం ఉందని అంటున్నారు.
ఒకవేళ సోమవారం మధ్యాహ్నం వరకు అనుమతి వచ్చినా గంటల వ్యవధిలో మంత్రులకు సమాచారం అందించి, అధికారులను సిద్ధం చేసి సమావేశం నిర్వహించడం సాధ్యమవుతుందా అనేది ప్రశ్న.