కాలయాపనకే ఉపసంఘం

First Published Nov 1, 2016, 4:55 AM IST
Highlights
  • కాలయాలపనకే ఉపసంఘం 
  • సర్వే ఆధారంగానే మంత్రివర్గ ఉపసంఘం
  • ప్రజల మనోభావాలు స్పష్టం
  •  

హైదరాబాద్ లోని ఏపి సచివాలయానికి చెందిన నాలుగు బ్లాకులను తెలంగాణాకు అప్పగింతపై మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించాలన్న మంత్రివర్గ నిర్ణయం వెనుక పెద్ద కథే నడిచింది. మెజారిటీ మనోభవాలను గమనించిన తర్వాత మాత్రమే ముఖ్యమంత్రి ఉపసంఘం వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు అధ్యక్షతన సోమవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చినప్పటికీ ఏపి ఆధ్వర్యంలోని నాలుగు సచివాలయ బ్లాకులను తెలంగాణా ప్రభుత్వానికి అప్పగించటమే ప్రధానం .

  ఈ అంశంపై మంత్రివర్గంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వటం వల్లే మంత్రివర్గ ఉపసంఘం వేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రులు మీడియాకు చెప్పారు. అయితే, మంత్రివర్గ ఉపసంఘం వేయాలన్న చంద్రబాబు ఆలోచన వెనుక పెద్ద కథే నడిచింది. ఈ కథ యావత్తు తెర వెనుక మాత్రమే జరిగింది.

  ఏపి ఆధీనంలోని నాలుగు బ్లాకులను తెలంగాణాకు ఇచ్చేయక తప్పదన్న సంగతి చంద్రబాబు గ్రహించారు. అయితే, వెంటనే ఇచ్చేయాలా లేక కొంత కాలయాపన చేయాలన్న అన్న విషయంలోనే ఎటూ తేల్చుకోలేక పోయారు. తెలంగాణా ప్రభుత్వం అడిగిన వెంటనే ఇచ్చేస్తే ప్రధాన ప్రతిపక్షం వైసీపీ రాజకీయంగా తమను ఇబ్బందులు పెడుతుందన్న విషయాన్ని కూడా చంద్రబాబు గ్రహించారు. దాంతో మధ్యే మార్గంగా రాష్ట్రంలోని వివిధ వర్గాల మనోభావాలు ఎలాగున్నాయో తెలుసుకుందామని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆ బాధ్యతను ఇంటెలిజెన్స్ విభాగానికి అప్పగించారు.

ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు కూడా సిఎం చెప్పిన విషయంపై రాష్ట్రంలోని దాదాపు అన్నీ జిల్లాల్లోని వివిధ వర్గాలతో శాంపిల్ సర్వే జరిపారు. ఈ సర్వేలో ఇంటెలిజెన్స్ అధికారులు అనేక వర్గాల అభిప్రాయాలను సేకరించారు. ఇందులో వ్యాపారస్తులు, ఉద్యోగులు, వృత్తి నిపుణులు, రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టులు కూడా ఉన్నారు. రెండు రోజుల పాటు జిరిగిన ఈ సర్వేలో ఏపి సచివాలయం బ్లాకులను తెలంగాణకు ఇవ్వటం పట్ల వ్యతిరేకత కనబడినట్లు సమాచారం.

 అంతే కాకుండా పదేళ్ళపాటు ఉన్న హక్కులను అర్ధాంతరంగా వదులుకోవాల్సిన అవసరం ఏమిటని పలువురు ఇంటెలిజెన్స్ శాఖను ప్రశ్నించినట్లు తెలిసింది. దాంతో ప్రజల మనోభావాలు ఏమిటో ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులకు అర్ధమైపోయింది. దాంతో సర్వే నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులు ముఖ్యమంత్రిని కలిసి తమ ఫీడ్ బ్యాక్ ను అందించారు.

  ఈ విషయమై పునరాలోచనలో పడిన సిఎం ఈ అంశాన్ని వ్యూహాత్మకంగా మంత్రివర్గంలో చర్చించారు. దాంతో ఆయన అనుకున్నట్లుగానే మంత్రుల్లో కూడా మిశ్రమ స్పందన రావటం ఏకాభిప్రాయం రాలేదు కాబట్టి మంత్రివర్గ ఉపసంఘం వేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు ప్రచారం చేయించారు. అంటే మంత్రివర్గ ఉపసంఘం వేయటమంటే కేవలం కాలయాపన చేయటమే కానీ నాలుగు బ్లాకులు ఇవ్వటం కుదరదని చెప్పటం కాదన్నవిషయం ప్రజలు ఆమాత్రం గ్రహించలేరా?

 

click me!