ఏపీ ప్రభుత్వానికి మరోసారి నిరాశ.. అమరావతి కేసులను మార్చి 28నే విచారణ చేపడతామన్న సుప్రీం కోర్టు..

By Sumanth KanukulaFirst Published Mar 2, 2023, 1:46 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశానికి సంబంధించిన కేసుల విషయంలో మార్చి 28న విచారణ జరపనున్నట్టుగా సుప్రీం కోర్టు పేర్కొన్న సంగతి  తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన విచారణను త్వరగా పూర్తిచేయాలని ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టును అభ్యర్థించింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశానికి సంబంధించిన కేసుల విషయంలో మార్చి 28న విచారణ జరపనున్నట్టుగా సుప్రీం కోర్టు పేర్కొన్న సంగతి  తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన విచారణను త్వరగా పూర్తిచేయాలని ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టును అభ్యర్థించింది. అయితే ఏపీ ప్రభుత్వం అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ముందుకు పేర్కొన్నట్టుగానే మార్చి 28వ తేదీనే ఈ కేసు విచారిస్తామని న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం తేల్చిచెప్పింది. 28వ తేదీ ఒక్క రోజే విచారణ సరిపోదని.. బుధ, గురువారాల్లో కూడా ఈ కేసును విచారించాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనాన్ని కోరారు. బుధ, గురువారాల్లో నోటీసులు ఇచ్చిన కేసుల్లో విచారణ జరపరాదని సీజేఐ సర్క్యూలర్ ఉందని ధర్మాసనం గుర్తు చేసింది.

రాజ్యాంగపరమైన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయని ఈ సందర్భంగా జస్టిస్ కేఎం జోసెఫ్ పేర్కొన్నారు. ఈ కేసు చాలా పెద్దదని, విచారణ చేపడితే దానికి సార్థకత ఉండాలని వ్యాఖ్యానించారు. తమ వినతిని సీజేఐ ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అనుమతినివ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరగా.. అందుకు కేఎం జోసెఫ్ ధర్మాసనం నిరాకరించింది.

ఇక, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి  తెలిసిందే. ఈ క్రమంలోనే రాజధాని అమరావతిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు హైకోర్టు ఇచ్చిన గడువుపై సుప్రీంకోర్టు గతంలో స్టే విధించింది. అయితే హైకోర్టు తీర్పులోని మరికొన్ని అంశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. 

అయితే ఆ తర్వాత వాస్తవానికి ఈ కేసులను ఈ నెల 23న విచారించాల్సి ఉంది. అయితే రాజ్యాంగ ధర్మాసనం విషయాల విచారణ దృష్ట్యా ఇతర పిటిషన్లపై విచారణ రద్దు చేయబడినందున సుప్రీం కోర్టులో ఇందుకు సంబంధించి విచారణ జరగలేదు. అయితే ఈ వ్యాజ్యాలను విచారించేందుకు ముందస్తు తేదీని నిర్ణయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు ప్రత్యేక ప్రస్తావన తెచ్చింది. న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి సోమవారం(ఫిబ్రవరి 27) వాదనలు వినిపించారు. అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పిటిషన్‌పై విచారణకు మార్చి 28వ తేదీని నిర్ణయించింది. అయితే తాజాగా ఇందుకు సంబంధించి త్వరితగతిన విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును మరోసారి కోరగా... అందుకు ధర్మాసనం తిరస్కరించింది.

click me!