బిగ్ బ్రేకింగ్ : త్వరలో ‘ఓటుకునోటు’ కేసు విచారణ

First Published Feb 17, 2018, 4:00 PM IST
Highlights
  • దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకునోటు’ కేసును తిరగతోడుతున్నారు.

ప్రతిపక్ష వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అవకతవకలకు, అవినీతికి పాల్పడుతోందన్న ఆరోపణలతో ఆళ్ల చాలా కాలంగా న్యాయపోరాటం చేస్తున్న విషయం అందరకీ తెలిసిందే. అదే వరసలో త్వరలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకునోటు’ కేసును తిరగతోడుతున్నారు.

ఈ కేసు ప్రస్తుతం సుప్రింకోర్టులో విచారణ జరుగుతోంది. మొన్నటి 5వ తేదీనే విచారణ జరగాల్సి ఉన్నా ఎందుకనో విచారణ జరగలేదు. అయితే ఈనెలాఖరులోగా ఎలాగైనా విచారణకు తీసుకురావాలన్న పట్టుదలతో ఆర్కె ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే తెలంగాణా ఏసిబి తమ వాదనలను సీల్డ్ కవర్లో సుప్రింకోర్టుకు అందచేసింది. అదేవిధంగా చంద్రబాబు, స్టీఫన్ సన్ ఫోన్ సంభాషణల టేపులను కూడా ఏసిబి కోర్టు ముందుంచింది. ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి కూడా రిపోర్టులు కోర్టుకు అందాయి.

సరే, ఈ కేసును పక్కనబెడితే దాదాపు 30 అంశాలపై ఎంఎల్ఏ కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేసారు. వాటిల్లో చాలా కేసులు విచారణదశలో ఉన్నాయి. ఓటుకునోటు రాజధాని గ్రామాల్లోని రైతుల ఇళ్ళను ప్రభుత్వం కొట్టేసేందుకు సిద్ధపడింది. అపుడు కూడా రైతుల తరపునే ఆళ్ళ కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారు.

రాజధాని రైతుల తరపునే సుమారు 20 కేసులు వేసారు. చంద్రబాబు క్యాంపు ఆఫీసుపైన కూడా కేసు వేశారు.  నదికి-కరకట్టకు మద్య ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ కృష్ణానది కరకట్టపైనే చాలా కట్టడాలున్నాయి. అవన్నీ అక్రమ కట్టడాలే. పైగా అందులో ఒకదానిలో చంద్రబాబు నివాసముంటున్నారు. ఈ విషయంపైన కూడా కేసు దాఖలు చేసారు. 

రాజధాని ప్రాంతంలో భూముల కుంభకోణాలు కావచ్చు, అమరావతి ప్రాంతంలో స్ధలాలను అనర్హులకు కట్టబెట్టారని కూడా కావచ్చు. ఇలా అనేక అంశాలపై న్యాయపోరాటం చేయటం ద్వారా చంద్రబాబు ప్రభుత్వానికి ఆళ్ళ గుక్క తిప్పుకోనీకుండా చేస్తున్నారు.

జీవో నెంబర్ 14 అమలును నిలిపేయాలంటూ కోర్టుకెక్కారు. రాష్ట్రంలోని మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వలకు వ్యతిరేకంగానే ఆళ్ళ హై కోర్టును ఆశ్రయించారు. పిటీషన్ను పరిశీలించిన కోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సదావర్తి సత్రం భూములపై కూడా ఆళ్ళే పోరాటం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబుపై పోరాటానికే ఆళ్ళ తన సమయాన్నంతా వెచ్చిస్తున్నారేమో?

 

click me!