వైఎస్ఆర్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ జగన్ ఆస్తుల కేసులో రఘురామకృష్ణం రాజు సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ:జగన్ ఆస్తుల కేసు విచారణను తెలంగాణలో కాకుండా మరో రాష్ట్రంలో చేపట్టాలని ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం నాడు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. జగన్ ఆస్తుల కేసును హైద్రాబాద్ లోని సీబీఐ కోర్టు విచారిస్తుంది. ఈ కేసు విచారణ ఆలస్యమౌతుందని ఎంపీ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు, సాక్షులుగా ఉన్నవారు క్వాష్ పిటిషన్లు దాఖలు చేస్తూ విచారణను ముందుకు సాగకుండా చేస్తున్నారని ఆ పిటిషన్ లో రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. వీటిపై విచారణ నిర్వహించడంతో విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆ పిటిషన్ లో రఘురామకృష్ణం రాజు కోరారు. అంతేకాదు ట్రయల్ ప్రక్రియను మరింత వేగవంతం కూడ చేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు.
undefined
ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ నిర్వహించింది.జస్టిస్ సంజీవ్ ఖన్నా, భట్టి నేతృత్వంలోని సుప్రీంకోర్టు దర్మాసనం ఇవాళ విచారణ చేసింది.ఈ పిటిషన్ కు విచారణ అర్హత ఉందో లేదో తేల్చడానికి ముందు ట్రయల్ ఎందుకు సీబీఐ కోర్టులో ఆలస్యం అవుతుందనే దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఆ తర్వాత పిటిషన్ పై విచారణను చేపడుతామని పేర్కొంది. రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. సీబీఐ కోర్టులో ట్రయల్ ఎందుకు ఆలస్యం అవుతుందో తమ ముందు నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సీబీఐని ఆదేశించింది.
ప్రతివాదులందరికి కూడ నోటీసులు జారీ చేయాలని కూడ సుప్రీంకోర్టు ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరి మాసంలో ఈ పిటిషన్ పై విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.