ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై సుప్రీంకోర్టు విచారణ... జగన్ సర్కార్ వాదనిదే

By Arun Kumar PFirst Published Feb 16, 2021, 1:38 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం మాజీ చీఫ్  ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై ఇవాళ మరోసారి జస్టిస్ ఎ.ఎం.ఖాన్ విల్కర్ ధర్మాసనం విచారణ జరిపింది.  

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం మాజీ చీఫ్  ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై ఇవాళ సుప్రీం కోర్టు విచారించింది. అతడి సస్పెన్షన్ ఎత్తివేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ  ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లారు. దీంతో హైకోర్టు ఆదేశాలపై గతంలో స్టే విధించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. తాజాగా ఈ వ్యవహారంపై ఇవాళ మరోసారి జస్టిస్ ఎ.ఎం.ఖాన్ విల్కర్ ధర్మాసనం విచారణ జరిపింది.  

ఈ పిటిషన్‍పై సమగ్రంగా విచారించనున్నట్లు ధర్మాసనం తెలపగా ఏపీ ప్రభుత్వం వారం రోజులు గడువు కావాలని కోరింది. దీంతో ఈ పిటిషన్‍పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు న్యాయమూర్తి.

 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏబీ వెంకటేశ్వరరావును టార్గెట్ చేసింది. 2017-18లో పోలీసు శాఖ ఆధునికీకరణ కోసం టీడీపీ ప్రభుత్వం భద్రతా పరికరాలు కొనుగోలు చేసిన వ్యవహారంలో ఏబీ అక్రమాలకు పాల్పడ్డట్లు ప్రభుత్వం ఆరోపించింది. పరికరాల కొనుగోలు కాంట్రాక్టును ఇజ్రాయిల్ కు చెందిన ఆర్టీ ఇన్ ఫ్లాటబుల్ ఆబ్జెక్ట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు దక్కెలా చేశారని వెల్లడించింది. అదే సంస్థకు తన కుమారుడు ఇండియా ప్రతినిథిగా ఉన్న సంగతిని దాచి పెట్టారని ఆరోపించింది.

ఈ విధంగా తన కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థకు ప్రయోజనం చేకూర్చారని ఏబీవీపై ఆరోపణలున్నాయి. అంతేకాకుండా టెండర్ల ప్రక్రియలో ప్రభుత్వ మార్గదర్శకాలను తొక్కిపెట్టారన్న అభియోగాలు కూడా ఉన్నాయి.

ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయంలో నిఘా పరికరాలను ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసేందుకు వినియోగించారని అప్పట్లో వైసీపీ ఆరోపించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసింది.రక్షణ పరికరాల కొనుగోలు అంశంలో నిబంధనలు పాటించకుండా దేశద్రోహానికి పాల్పడ్డారని కూడా ఆరోపించింది. ఈ అభియోగాల నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేసింది. అంతేకాకుండా పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. 
 
 

 

click me!