
‘ఓటుకునోటు’ కేసు భవిష్యత్తులో చంద్రబాబు మెడకు చుట్టుకునేట్లే కనబడుతోంది. వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణ రెడ్డి వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సోమవారం సుప్రింకోర్టు వ్యవహరించిన తీరు చూస్తే భవిష్యత్తులో చంద్రబాబునాయుడుకి కష్టాలు తప్పవేమో అనే అనిపిస్తోంది. దాదాపు రెండేళ్ళ క్రిందట వెలుగు చూసిన ఓటుకునోటు కేసులో విచారణ పరంగా పెద్దగా పురోగతి కనిపించలేదు. దానికి తోడు ఏసిబి విచారణ ఆదేశాలపై హై కోర్టు స్టే ఇవ్వటంతో కేసు విచారణ నత్తనడకను తలపిస్తోంది.
రెండేళ్ళ క్రిందట తెలంగాణాలో జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో టిడిపి కూడా వేం నేరేందర్ రెడ్డిని అభ్యర్ధిగా నిలిపింది. నిజానికి టిడిపి అభ్యర్ధికి గెలుపు అవకాశాలు లేకపోయినా ఎన్నికల్లో దిగింది. తెరవెనుక మంత్రాంగాన్ని నమ్ముకునే రంగంలోకి అభ్యర్ధిని దింపింది. మంత్రాంగమంటే మరేంలేదు ‘ఓటుకునోటు’ వ్యవహారమని వేరే చెప్పనక్కర్లేదు. ప్రతీ ఓటుకు ఇంత అని లెక్కకట్టి వేయించుకోవటమే. అదే ఇపుడు చంద్రబాబు కొంపముంచబోతోంది.
వ్యూహం పన్నటం వరకూ బాగానే పన్నారు కానీ మధ్యలోనే లీకైంది. దాంతో విషయం ఎవరికి చేరకూడదో వారికే చేరింది. టిఆర్ఎస్ లోని కొందరితో పాటు నామినేటెడ్ ఎంఎల్ఏ ఓటుకు కూడా టిడిపి భారీగానే ధర కట్టినట్లు ప్రచారం జరిగింది. అందులో భాగంగానే నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ కు రూ. 50 లక్షల అడ్వాన్స్ ఇవ్వటానికే ఒప్పందం కుదిరింది. అడ్వాన్స్ ఇవ్వటానికి స్టీఫెన్ ఇంటికి వెళ్ళినపుడే టిడిపి ఎంఎల్ఏ రేవంత్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది.
దాంతో తీగలాగితే డొంకంతా కదిలినట్లు టిడిపిలో ముఖ్యుల బండారమంతా బట్టబయలైంది. దానికితోడు స్టీఫెన్ తో ముఖ్యుల సెల్ ఫోన్ సంభాషణల ఆడియో టేపు వెలుగు చూడటంతో దేశవ్యాప్తంగా ఎంత సంచలనం కలిగించిందో అందరికీ తెలిసిందే. సరే, దాని తర్వాత జరిగిన వ్యవహారాలన్నీ అందరికీ తెలిసిందే. అదే సందర్భంగా సిఎంలు కెసిఆర్, చంద్రబాబుల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు దేశమంతా చూసిందే. తర్వాత ఇద్దరి మధ్య ఢిల్లీ స్ధాయిలో మధ్యవర్తులు రాజీ చేసారంటూ ప్రచారం కూడా జరిగింది.
దాని పర్యవసానమే రెండు రాష్ట్రాలకు పదేళ్ళ పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పటికీ చంద్రబాబునాయుడు అర్ధాంతరంగా వదిలి విజయవాడకు చేరుకోవాల్సి వచ్చింది. తర్వాత నుండి ఏసిబి కోర్టులో విచారణ నత్తను తలపిస్తోంది. సరిగ్గా అక్కడే వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ సీన్ లోకి ఎంటరయ్యారు. చంద్రబాబు దోషిగా నిరూపించేందుకు అన్నీ ఆధారాలున్నప్పటికీ ఉద్దేశ్యపూర్వకంగానే కేసు విచారణలో పురోగతి కనిపించటం లేదంటూ సుప్రింకోర్టులో కేసు వేసారు. ఆ కేసుపైనే సుప్రింకోర్టు ఈరోజు స్పందించింది.
ఆళ్ళ పిటీషన్ పై తెలంగాణా ఏసిబి సుప్రింకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు సమాచారం. ఆ అఫిడవిట్ ప్రకారం కేసులో భాగంగా వెలుగు చూసిన ఆడియో టేపులు జరిగిన కుట్రకు సాక్ష్యాలుగా ప్రవేశపెట్టారట. ఆడియోటేపుల్లోని గొంతులు ఒరిజినలే అని కూడా అంగీకరించినా ఆ గొంతులు ఎవరివి అని మాత్రం ఏసిబి చెప్పలేదట. తాజాగా ఆళ్ళ వేసిన పిటీషన్ విచారణకు స్వీకరించిన నేపధ్యంలో మొత్తం డొంకంతా కదులుతుందని అనుకుంటున్నారు. అది నిజమే అయితే టిడిపికి ఇబ్బందులు తప్పేట్లు లేదు.