కృష్ణా ట్రిబ్యునల్ కు నూతన విధివిధానాలపై ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ గడువు కోరడంతో విచారణ వాయిదా పడింది.
న్యూఢిల్లీ:కృష్ణా ట్రిబ్యునల్ కు నూతన విధి విధానాలపై ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను శుక్రవారం నాడు సుప్రీంకోర్టు 2024 జనవరి 12వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయడానికి కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ సమయం కోరడంతో విచారణను వచ్చే ఏడాది జనవరి 12వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
ఈ ఏడాది అక్టోబర్ మాసంలో కృష్ణా జలాలపై నిర్మించిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 4న నిర్ణయం తీసుకుంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య కృష్ణా జలాలను తాజాగా లెక్కించి పంపిణీ చేయాలంటూ కృష్ణా ట్రిబ్యునల్ కు ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. అంతేకాదు కృష్ణా ట్రిబ్యునల్ గడువును కూడ పెంచింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 17న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.