
ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏపీ కో-కన్వీనర్ సునీల్ ధియోధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం లేదని మరోసారి స్పష్టం చేశారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని నష్టాన్ని చవిచూశామని చెప్పారు. ఢిల్లీలో సునీల్ ధియోధర్ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. పవన్ కల్యాణ్ రోడ్ మ్యాప్ వ్యవహారాన్ని తాము అంతర్గతంగా చర్చించుకుంటామని తెలిపారు. రోడ్డు మ్యాప్‌పై మీడియాతో పవన్ మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వ్యవహారాన్ని తాము సీరియస్‌గా తీసుకోవడం లేదని అన్నారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ-జనసేన కూటమిని ప్రజలు భావిస్తున్నారని ఆయన చెప్పారు.
ఇటీవల కూడా సునీల్ ధియోధర్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి బీజేపీ నేతలు చాలా మంది జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో మాట్లాడారని చెప్పారు. వైసీపీ, టీడీపీలు రెండు దొంగ పార్టీలేనని విమర్శించారు. ఏపీలో జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని తెలిపారు. కన్నా లక్ష్మీ నారాయణ కామెంట్స్‌పై సోము వీర్రాజు స్పందించారని.. అంతకు మించి తాను చెప్పేదేం లేదని అన్నారు.
ఇక, ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ ఏపీ బీజేపీలో చర్చకు దారితీశాయి. తాను రోడు మ్యాప్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని పవన్ అన్నారు. రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారబోతుందని అన్నారు. తనకు మోదీ, బీజేపీ అంటే గౌరవమని... అలాగని ఊడిగం చేయనని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై కన్నా లక్ష్మీ నారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.