తిరుపతిలో విషాదం... హాస్టల్ గదిలో విద్యార్థి సూసైడ్... షాక్ తో వార్డెన్ కు హార్ట్ ఎటాక్

Published : Feb 05, 2023, 08:55 AM IST
తిరుపతిలో విషాదం... హాస్టల్ గదిలో విద్యార్థి సూసైడ్... షాక్ తో వార్డెన్ కు హార్ట్ ఎటాక్

సారాంశం

హాస్టల్ గదిలో ఇంజనీరింగ్ చేస్తున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో షాక్ గురయిన వార్డెన్ గుండెపోటుతో మృతిచెందాడు. ఇలా ఒకేరోజు ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన తిరుపతి జిల్లాలో వెలుగుచూసింది. 

తిరుపతి : కాలేజీ హాస్టల్లోనే ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా... ఇది తెలిసి షాక్ తో వార్డెన్ కూడా మృతిచెందాడు. ఇలా ఒకేసారి ఇంజనీరింగ్ విద్యార్థి, హాస్టల్ వార్డెన్ మృతిచెందిన దుర్ఘటన తిరుపతి జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘటనతో సదరు కార్పోరేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం నెలకొంది.  

పోలీసులు, కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకుల వివరాల ప్రకారం... తిరుపతి జిల్లా గూడురు పట్టణ శివారులోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు చెందిన ధరణేశ్వరరెడ్డి(21) ఇంజనీరింగ్ చేస్తున్నారు. సీఎస్ఈ సెకండ్ ఇయర్ చదువుతున్న అతడు కాలేజీ హాస్టల్లోనే వుండేవాడు. అయితే ఎమయ్యిందో ఏమో శనివారం ఎప్పటిలాగే కాలేజీకి వెళ్లిన ధరణేశ్వర్ మధ్యలోనే హాస్టల్ కు తిరిగివచ్చాడు. గదిలో విద్యార్థులెవ్వరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. 

ధరణేశ్వర్ ఆత్మహత్యను గుర్తించిన విద్యార్థులు హాస్టల్ వార్డెన్ శ్రీనివాసులు నాయుడు(57) కు సమాచారమిచ్చారు. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురయిన అతడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. హాస్టల్ సిబ్బంది వెంటనే అతడిని హాస్పిటల్ కు తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ వార్డెన్ ప్రాణాలు విడిచాడు. 

ఇదిలావుంటే విద్యార్థి ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యం ఒత్తిడే కారణమంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాలేజీ యాజమాన్యం మాత్రం వ్యక్తిగత కారణాల వల్లే ధరణేశ్వర్ ఆత్మహత్య చేసుకున్నాడని కాలేజీ యాజమాన్యం చెబుతోంది.  

ధరణేశ్వర్ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. విద్యార్థి బ్యాగ్ లో ఓ కత్తిని గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుందని పోలీసులు తెలిపారు.

ఉన్నత చదువుల కోసం కుటుంబానికి దూరంగా హాస్టల్లో వుంటున్న కొడుకు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అలాగే హాస్టల్ వార్డెన్ మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. ఒకేసారి విద్యార్థి, వార్డెన్ మృతిచెందడంతో నారాయణ కాలేజీ విద్యార్థులు కూడా బాధలో మునిగిపోయారు. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Pressmeet: చంద్రబాబు, పవన్ పై వైఎస్ జగన్ పంచ్ లు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan: జనసేన సభ్యుడు కుటుంబాన్నిపరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ | Asianet Telugu