ఏలూరులో కిరాతకం... ప్రియురాలిని, మైనర్ కూతుర్ని గునపంతో కొట్టిచంపిన తాగుబోతు

By Arun Kumar PFirst Published Feb 5, 2023, 7:53 AM IST
Highlights

ఓ తాగుబోతు లారీ డ్రైవర్ పదేళ్ళుగా సహజీవనం చేస్తున్న ప్రియురాలితో పాటు ఆమె మైనర్ కూతుర్ని అతి కిరాతకంగా కొట్టిచంపిన ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

ఏలూరు : విద్యుత్ బిల్లు విషయంలో జరిగిన గొడవ రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. సహజీవనం చేస్తున్న ప్రియురాలితో పాటు ఆమె బిడ్డను అతి కిరాతకంగా గనపంతో కొట్టిచంపాడు ఓ కసాయి లారీ డ్రైవర్. ఈ దారుణం ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... నూజివీడు మండలం మీర్జాపురం గ్రామానికి చెందిన దేవరపల్లి రవి లారీ డ్రైవర్. ఇతడు భార్యకు విడాకులిచ్చి ఒంటరిగా వుండేవాడు. ఈ క్రమంలోనే భర్తకు దూరమై బిడ్డతో కలిసుంటున్న యేసుమరియమ్మతో రవికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒంటరిగానే వుండటంతో ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలం తర్వాత కూతురు అఖిలతో కలిసి ప్రియుడి రవి వద్దే వుంటూ సహజీవనం ప్రారంభించింది మరియమ్మ. ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఈ ముగ్గురూ జీవించేవారు. రవి లారీ డ్రైవర్ గా, మరియమ్మ కూలీపనులు చేసుకోగా మైనర్ బాలిక అఖిల(15) పదో తరగతి చదువుతోంది. 

అయితే రవి కొంతకాలంగా మద్యానికి బానిసై ప్రియురాలిని, ఆమె బిడ్డ అలనాపాలనా మరిచాడు. చివరకు నివాసముంటున్న ఇంటి కరెంట్ బిల్లు కూడా కట్టకపోవడంతో విద్యుత్ సిబ్బంది సరఫరా నిలిపివేసారు. ఈ విషయంతో రవి, మరియమ్మకు మద్య గొడవ జరిగింది. రవి తీరుతో విసిగిపోయిన ఆమె బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.  

గత శుక్రవారం ప్రియురాలి పుట్టింటికి వెళ్లి బుద్దిగా వుంటానని... తిరిగి తనవద్దకు రావాలంటూ మరియమ్మను వేడుకున్నాడు రవి. ఆ మాటలు నమ్మి బిడ్డతో కలిసి అతడి వెంట వెళ్లింది మరియమ్మ. అయితే అదేరోజు రాత్రి రవి ఫుల్లుగా మద్యంసేవించి వచ్చి కౄరంగా వ్యవహరించాడు. తనను విడిచి వెళతారా అంటూ మరియమ్మతో పాటు ఆమె బిడ్డ అఖిలను గునపంతో తలపై బాదాడు. దీంతో రక్తపుమడుగులో పడి తల్లీబిడ్డ మృతిచెందారు. ఇద్దరి మృతదేహాలను అక్కడే వదిలి రవి పారిపోయాడు. 

శనివారం మరియమ్మ ఫోన్ కు ఆమె సోదరుడు కాల్ చేయగా ఎంతకూ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లాడు. తాళం వేసి వుండటంతో కిటికీలోంచి చూడగా రక్తపుమడుగులో మృతదేహాలు కనిపించాయి. దీంతో అతడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, డిఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ సిబ్బందితో కలిసి సంఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. పరారీలో వున్న రవికోసం గాలింపు చేపట్టారు. 

click me!