సింహాచలం ప్రమాదం ప్రకృతి విపత్తే... శవ రాజకీయాలొద్దు జగన్ : అచ్చెన్నాయుడు

Published : Apr 30, 2025, 09:50 PM IST
సింహాచలం ప్రమాదం ప్రకృతి విపత్తే... శవ రాజకీయాలొద్దు జగన్ : అచ్చెన్నాయుడు

సారాంశం

సింహాచలంలో దుర్ఘటనతో జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. గతంలో జరిగిన దుర్ఘటనల్లో జగన్ స్పందించలేదు.. కానీ ఇప్పుడు శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

Simhachalam Tragedy : సింహాచలం ఆలయంలో జరిగిన విషాద సంఘటనను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల కోసం వాడుకోవాలని చూస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.  ప్రకృతి విపత్తు కారణంగా జరిగిన దుర్ఘటనపై నీచమైన రాజకీయాలు చేయడం ఆయనకే చెల్లిందన్నారు. పరామర్శ నెపంతో శవ రాజకీయాలు చేస్తున్నాడని వైసిపి అధినేతపై మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

''సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవం కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే వర్షం కారణంగా గోడ తడిసి బలహీనపడిందని... టికెట్ కౌంటర్ వద్ద నిల్చున్న భక్తులపై కూలిపడింది. ఈ దుర్ఘటనలో కొందరు అక్కడికక్కడే మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరం మరియు బాధాకరం'' అని అచ్చెన్నాయుడు అన్నారు. 

ఈ సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించింది... గాయపడినవారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. క్యూలైన్లను క్రమబద్ధీకరించి, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూసిందన్నారు. రెస్క్యూ సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, మంత్రులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారన్నారు. ఈ గోడ ఉత్సవ సమయంలో మాత్రమే తాత్కాలిక క్యూలైన్‌గా ఉపయోగించబడుతుందన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని ప్రభుత్వం నియమించిందన్నారు అచ్చెన్నాయుడు. 

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడినవారికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిట్లు మంత్రి తెలిపారు. అలాగే దేవాదాయ శాఖ పరిధిలో ఆయా కుటుంబ సభ్యులకు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని ఆదేశించామన్నారు.

ప్రకృతి విపత్తు సమయంలో ప్రభుత్వానికి సహకరించకుండా, బాధితులకు అండగా నిలవకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వార్థపూరిత శవ రాజకీయాలకు పాల్పడుతున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బెంగళూరు నుంచి బయటకు వచ్చిన ప్రతిసారీ ఆంధ్రప్రదేశ్‌లో అలజడి సృష్టిస్తున్నాడన్నారు. తన ఐదేళ్ల పాలనలో అనేక దుర్ఘటనలు జరిగాయి... అప్పుడు ఎన్నడూ  తాడేపల్లి నుంచి బయటకు రాని జగన్ ఇప్పుడు రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు, శవ రాజకీయాలు చేసేందుకు బయటకు వస్తున్నాడన్నారు. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వాన్ని, పోలీసులను దూషించడం జగన్‌కు అలవాటైపోయిందని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. 

''జగన్ రెడ్డి హయాంలో జరిగిన ప్రమాదాల్లో బాధితులను పరామర్శించేందుకు కనీసం వెళ్లాడా? తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 112 మంది మరణించినప్పుడు ఎందుకు పరామర్శించలేదు? వారికి ఎలాంటి పరిహారం అందించాడు? జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం ఘటనలో 27 మంది చనిపోయినప్పుడు జగన్ ఎందుకు స్పందించలేదు? విశాఖపట్నం హిందూస్తాన్ షిప్‌యార్డ్‌లో క్రెయిన్ కూలిన ఘటనలో 11 మంది మరణించినప్పుడు జగన్‌కు కనిపించలేదా? అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు జగన్ ఎక్కడ ఉన్నాడు?'' అంటూ నిలదీసారు.

''కచ్చలూరు బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు చివరి చూపు కూడా దక్కకుండా చేసిన జగన్ రెడ్డి అసమర్థతను ఎవరు మరచిపోగలరు... విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలో కంపెనీ ఇచ్చిన పరిహారాన్ని తానిచ్చినట్టు గొప్పలు చెప్పుకున్న జగన్‌ను చూసి ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు... విజయవాడ వరద బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇస్తానని చెప్పిన జగన్, ఆ మాట ఎక్కడ నెరవేర్చాడు?జగన్ రెడ్డి నీచమైన రాజకీయాలు చూసి ప్రజలు విసిగిపోయారు. ఇకనైనా మానవీయంగా ఆలోచిస్తేనే జగన్‌కు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది'' అని అచ్చెన్నాయుడు సూచించారు. 


 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్