
Simhachalam: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి (సింహాద్రి అప్పన్న స్వామి) ఆలయంలో బుధవారం వార్షిక ఉత్సవం (చందనోత్సవం)లో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కురిసిన భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. చందనోత్సవం సందర్భంగా దర్శనం కోసం టిక్కెట్లు కొనడానికి క్యూలో నిలబడి ఉన్న సమయంలో భక్తులపై గోడ కూలిపోయింది. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పలువురు నేతలు ఈ ఘటనపై స్పందించారు.
సింహాచలంలో గోడ కూలిన ఘటన పై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన కలచివేసిందని చెప్పారు. అక్కడి పరిస్థితిపై అధికారులతో మాట్లాడినట్టు చెప్పారు. ఈ ప్రమాదంపై సమీక్ష జరిపిన చంద్రబాబు.. ప్రత్యేక కమిటీని విచారణ కోసం ఏర్పాటు చేశారు. 72 గంటల్లో నివేదిక అందించాలని సూచించారు.
సింహాచలం ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది ఘటన దురదృష్టకరమనీ, బాధితులకు అండగా ఉంటామని చెప్పారు.
సింహాచలం ఆలయం వద్ద జరిగిన దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ ఘటనలో గాయపడినవారికి విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స అందుతోందనీ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, ఈ విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ నరసింహ స్వామి చందనోత్సవ సందర్భంగా జరిగిన విషాద ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భక్తులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందన్నారు.
స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇలాంటి విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా బాధించిందని ఆయన తెలిపారు. గాయపడిన భక్తులకు అత్యుత్తమ వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని జగన్ ప్రభుత్వాన్ని కోరారు.
సింహాచలంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే భక్తులు ప్రాణాలు పోయాయని గుడివాడ అమర్నాథ్ అన్నారు. సింహాద్రి అప్పన్న చందనోత్సవం రోజు లక్షల మంది భక్తులు వస్తారని తెలిసి కూడా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు. కూలిన గోడకు క్యూరింగ్ కాలేదు. ఫ్లైయాష్ తెచ్చి కట్టారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వర్షం వల్ల గోడ కూడా ఊగిందని చెబుతున్నారు. నాణ్యత లేని గోడలు కట్టి, ఆ పక్కనే క్యూ లైన్లు పెట్టారు అని ఆయన విమర్శించారు.