విశాఖ స్టీల్ పై జగన్నాటకాలు ఆపండి ఫేక్ సీఎం...: జగన్ పై లోకేష్ ఫైర్

By Arun Kumar PFirst Published Jul 8, 2021, 12:35 PM IST
Highlights

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో స్పందిస్తూ సీఎం జగన్, వైసిపి ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికన విరుచుకుపడ్డారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. 

అమరావతి: విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. తాజాగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి లీగల్ అడ్వైజర్, ట్రాన్సాక్షన్ అడ్వైజర్ లను నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్, వైసిపి ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికన విరుచుకుపడ్డారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. 

''ఫేక్ సీఎం జగప్ గారూ! విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ వ‌ద్దంటూ మీరు చేసిన అసెంబ్లీలో తీర్మానం, కేంద్రానికి రాసిన లేఖ‌లు ఫేక్ అని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీక‌ర‌ణ ప్రక్రియను వేగ‌వంతం చేయ‌డంతో తేలిపోయింది'' అంటూ ట్విట్టర్ వేదికన జగన్ తీరును ఎండగట్టారు లోకేష్. 

''ఇప్ప‌టికైనా జ‌గ‌న్నాట‌కాలు ఆపి, ఢిల్లీ వెళ్లి ప్రైవేటీక‌ర‌ణ‌ని ఆపే ప్ర‌య‌త్నాలు చేయండి. ప‌దుల సంఖ్య‌లో ఉద్య‌మ‌కారుల ప్రాణ‌త్యాగాల‌తో ఏర్ప‌డిన విశాఖ ఉక్కుని ప్రైవేట్ ప‌రం చేయ‌డానికి స‌హ‌క‌రించిన రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా చ‌రిత్ర‌హీనులుగా మిగిలిపోతారు. కాబట్టి మీ ఎంపీల్ని మీ కేసుల మాఫీ లాబీయింగ్ కోసం కాకుండా, ఏపీ ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణ‌కి పోరాడాల‌ని ఆదేశాలివ్వండి'' అని లోకేష్ సూచించారు. 

read more  కమీషన్ల కోసం కన్నతల్లిని కూడా అమ్ముకునే రకం: జగన్ పై అచ్చెన్న సంచలనం

ఇక ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడాన్ని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.   స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని  కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రేవేటీకరణపై తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ గురువారం ఉదయం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. 

కార్మికులు, ఉద్యోగులు ఆందోళనలు నిర్వహిస్తున్నా  ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రైవేటీకరణకే  మొగ్గుచూపడంపై కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు.  విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకొనేవరకు తాము పోరాటాన్ని కొనసాగిస్తామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. 

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమయంలో ఎలాంటి చిక్కులు రాకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం అడ్వైజర్లను నియమించుకొంటుంది.  స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడ ప్రధాని మోడీకి లేఖ రాశారు. విపక్షాలు కూడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి. కానీ కేంద్ర మాత్రం మెనక్కు తగ్గడం లేదు.   
 
 

click me!