
పల్నాడు : ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. అధికారం వైసిపి, ప్రతిపక్ష టిడిపిల మధ్య మాటలయుద్దం కాస్త మరింత ముదిరి గొడవలకు దారితీసాయి. ఇలా టిడిపి నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పాల్లొనే సభపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడికి దిగిన ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.
పల్నాడు జిల్లా తెలుగుదేశం ఆధ్వర్యంలో ముప్పాళ్ల మండలం తొండపిలో 'బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ' కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సభకు ముఖ్య అతిథిగా సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణను ఆహ్వానించారు. ఆయన సమక్షంలో కొందరు నాయకులు టిడిపిలో చేరాల్సి వుంది. ఇలా కార్యక్రమానికి అంతా సిద్దమై మరికొద్దిసేపట్లో కన్నా హాజరవుతారనగా ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభాస్థలిలో లైట్లను ఆర్పేసిన గుర్తుతెలియని దుండగులు సమీప భవనాల నుండి రాళ్లదాడికి దిగారు. ఈ దాడిలో కన్నా పీఏ స్వామి తల పగలడంతో పాటు మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
Also Read వైసిపికి కౌంట్ డౌన్ షురూ... 50-60 ఎమ్మెల్యేలు బయటకురావడం పక్కా..: గంటా శ్రీనివాసరావు
దాడి విషయం తెలిసి వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న కన్నా లక్ష్మీనారాయణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ క్రమంలో వేదికపైనే డిఎస్పీ, కన్నా మధ్య వాగ్వాదం జరిగింది. టిడిపి శ్రేణులు కూడా కర్రలతో సభస్థలికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో పరిస్థితి చేయిదాటేలా కనిపించడంతో పోలీసులు కార్యక్రమాన్ని ఆపాలని విజ్ఞప్తి చేసారు. అయినా వెనక్కి తగ్గకుండా ఉద్రక్తతల మధ్యే కార్యక్రమాన్ని కొనసాగించారు కన్నా లక్ష్మీనారాయణ.
వీడియో
ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నా మాట్లాడుతూ... రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు తొండపి ఘటనే నిదర్శనమని అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులపై అధికార పార్టీ దౌర్జన్యానికి దిగుతుంటే వారికి పోలీసులు కాపలా కాస్తున్నారని అన్నారు. ఇలా దొంగల ముఠా పాలనకు పోలీసులు తోడవుతున్నారని ఆరోపించారు.
స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను వైసిపి లోకి ఆహ్వానించినా వెళ్లలేదు... అందువల్లే ఆయన తనపై కక్షగట్టారని కన్నా అన్నారు. ఈ రాక్షసపాలనకు చరమగీతం పాడేందుకు చంద్రబాబుతో కలిసానని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓటుతోనే వైసిపి ప్రభుత్వానికి, సీఎం జగన్ కి సమాధానం చెబుతారని హెచ్చరించారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది... పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని కన్నా అన్నారు. అధకారపార్టీ అరాచక పాలనతో ప్రజాస్వామ్యం అన్నదే రాష్ట్రంలో కనిపించడంలేదన్నారు. రాష్ట్ర సంపదను దొంగలముఠా దోచుకు తింటోందని కన్నా ఆరోపించారు. కాబట్టి ప్రజలు టిడిపికి మద్దతుగా నిలిచి వైసిపి పాలనకు చరమగీతం పాడాలని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కోరారు.