Latest Videos

రాజకీయ నేతల గుప్పెట్లో బందీలైన క్రీడా సంఘాలు... పవన్ కల్యాణ్‌కు వెల్లువెత్తుతున్న వినతులు

By Galam Venkata RaoFirst Published Jun 30, 2024, 4:01 PM IST
Highlights

రాజకీయ నేతల గుప్పెట్లో క్రీడా సంఘాలు బందీలయ్యాయని పలువురు క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి విన్నవిస్తున్నారు.

‘‘గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రంగాలూ అథోగతి పాలయ్యాయి. క్రీడా రంగం సైతం అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రంలో దారి తప్పిన వ్యవస్థలను దారిలో పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధృడ సంకల్పంతో వడివడిగా అడుగులు వేస్తున్నారు’’. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమితంగా ఇష్టపడే మేధావులు, ప్రముఖులు, వాణిజ్యవేత్తలు, క్రీడాకారులు పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు. 

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, ఢిల్లీకి చెందిన క్రీడాకారులు ఈ మధ్య కాలంలో కలిసిన వారిలో ఉన్నారు. ఇలా కలసిన వారిలో ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రీడారంగం అభివృద్ధికి దోహదపడే అనేక విషయాలను వారు ప్రస్తావించారు. క్రీడా సంఘాలు బాగుపడితేనే అత్యుత్తమ క్రీడాకారులు రూపొందుతారని దానికి సరైన మార్గదర్శనం చేసేవారు అవసరమని వారు పవన్ కళ్యాణ్‌కు విన్నవించారు. క్రీడలతో సంబంధంలేని వారి చేతికి క్రీడా సంఘాలను అప్పగించవద్దని వారు ఆవేదనతో విన్నవించారు. క్రికెట్ లో అనుభవం ఉన్నవారికే క్రికెట్ సంఘం భాద్యతలు అప్పగించాలని, అలాగే కబడ్డీ ఆటపై పట్టు ఉన్నవారికే కబడ్డీ సంఘాన్ని అప్పగించాలని కోరారు. ఇదే పద్దతి అన్ని సంఘాలలో అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగంలో అగ్రగామిగా నిలుస్తుందని సూచించారు. 

ఇలా క్రీడా సంఘాల్లో జరుగుతున్న కొన్ని విషయాలను క్రీడాకారులు వివరించినప్పుడు పవన్ కళ్యాణ్ ఆవేదన చెందారు. కొన్ని క్రీడా సంఘాలు రాజకీయ ఉపాధి ఆవాస కేంద్రాలుగా మారిపోవడం వల్ల క్రీడాకారులకు ఇచ్చే సర్టిఫికేట్లు అంగడి సరుకుగా మారిపోయాయని తెలిపారు. దానివల్ల ఎటువంటి క్రీడానుభవం లేనివారు క్రీడాకారుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో సీట్లు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడా సంఘాల్లో తిష్టవేసిన రాజకీయ నాయకులు క్రీడాకారుల ఎంపికలో తమ బందువులు, సన్నిహితుల పిల్లలను వారి అధికార దర్పంతో ఎంపిక చేయిస్తున్నారని... ఫలితంగా పోటీల్లో వారు నిలబడలేకపోతున్నారని తమ బాధను వెలిబుచ్చారు. క్రీడా సంఘాల నిధులు యథేచ్ఛగా దోపిడీకి గురవుతున్నాయని, క్రీడా సంఘాల్లో క్రీడానుభవం లేని రాజకీయ నాయకులకు ప్రవేశం లేకుండా చూడాలని కోరారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, ముఖ్యంగా క్రికెట్ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని వారు ముందుకు వచ్చారు.

క్రీడాకారుల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు విన్న పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తానని వారికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం క్రీడా సంఘాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. క్రీడలకు పూర్వ వైభవాన్ని తప్పకుండా తీసుకు వస్తామని తనను కలిసిన క్రీడాకారులకు భరోసా ఇచ్చారు.

ఇటీవల క్రికెటర్ హనుమ విహారి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ఈ సందర్భంగా హనుమ విహారి కెరీర్‌తో పాటు ఇటీవల ఎదుర్కొన్న సవాళ్ల గురించి వారిద్దరితో చర్చించారు. మంత్రి నారా లోకేశ్‌ భరోసాతో మళ్లీ ఆంధ్రా క్రికెట్‌ జట్టుకు ఆడాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వం తనను అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టిందని గుర్తుచేసుకున్నారు. అయితే, ఆ సమయంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, లోకేశ్‌ అండగా నిలిచారని తెలిపారు. కాగా, టీ20 ప్రపంచ కప్‌ను టీమిండియా గెలుచుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో క్రీడారంగం పరిస్థితి చర్చకు వచ్చింది.

click me!