ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసారు... అధికారాన్ని కోల్పోయారు... ప్రతిపక్షహోదాకు సరిపడా సంఖ్యాబలం కూడా లేదు. అయినా వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత కావాలనుకుంటున్నారు. మరి అంతలా ఆ పోస్టులో ఏముందంటే...
అమరావతి : ఆంధ్ర స్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఆవిర్భావం తర్వాత ఎప్పుడూ లేనంత ఘోర పరాభవాన్నిచవిచూసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 175 కు 151 సీట్లు గెలుచుకున్న అంతెత్తుకు ఎగిసిన జగన్ పార్టీ 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే సాధించి అధ:పాతాళానికి పడిపోయింది. తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి చరిత్రను తిరగరాస్తూ 164 సీట్లు సాధించింది... ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వమే ఆంధ్ర ప్రదేశ్ లో పాలన సాగిస్తోంది.
అయితే వైసిపి కేవలం 11 సీట్లకే పరిమితం కావడంతో ఆ పార్టీ ప్రతిపక్ష హోదా దక్కుతుందా..? లేదా..? అన్న చర్చ సాగుతోంది. కూటమి తర్వాత అత్యధిక సీట్లు సాధించింది వైసిపినే... కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ జగన్ తో పాటు ఆ పార్టీ నాయకులు కోరుతున్నారు. కానీ మొత్తం అసెంబ్లీ సీట్లలో కనీసం పదిశాతం సీట్లు సాధిస్తేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది... వైసిపికి ఆ సంఖ్యాబలం లేదుకాబట్టి అందుకు అర్హత లేదని కూటమి ప్రభుత్వ వాదన. ఇప్పటికే వైఎస్ జగన్ ను ప్రతిపక్ష నేతగా గుర్తించబోమని స్పీకర్ అయ్యన్నపాత్రుడ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేసారు.
ప్రభుత్వం కుదరదంటున్నా వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతున్నారు. ఇటీవల తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నకు లేఖ రాసారు. కనీసం ఇన్ని సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాజ్యాంగంలో గానీ, సభా ప్రవర్తనా నియమావళిలో గానీ లేదని పేర్కొన్నారు. 1984లో 543 లోక్ సభ స్ధానాలకు ఎన్నికలు జరిగితే టీడీపీ 30 సీట్లు గెలుచుకుంది... ఇది మొత్తం సీట్లలో పదిశాతం కాకపోయినా టిడిపి నేత పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారని గుర్తుచేసారు. ఇక 1994లో కూడా ఇలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 సీట్లకు గాను కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే సాధించింది... ఇలా కనీసం 10 శాతం సీట్లు లేకపోయినా కాంగ్రెస్ ను ప్రతిపక్షంగా గుర్తించారని... 2015లో ఢిల్లీ అసెంబ్లీలోనూ ఇలాగే కేవలం 3 సీట్లున్న బిజెపికి ప్రతిపక్ష హోదా దక్కిందని వైఎస్ జగన్ గుర్తుచేసారు. కాబట్టి అధికార పార్టీ తర్వాత ఏ పార్టీకయితే ఎక్కువ సీట్లుంటాయో దానికి ప్రతిపక్ష హోదా కల్పించడం సాంప్రదాయంగా వస్తోందని...దాన్ని కొనసాగించాలని స్పీకర్ అయ్యన్నను కోరారు వైఎస్ జగన్.
ప్రభుత్వం ససేమిరా అంటున్నా వైఎస్ జగన్ ఎందుకంత తాపత్రయ పడుతున్నారు? ప్రతిపక్ష నేతకు ఏమైనా పవర్స్ వుంటాయా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ మొదలయ్యింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష హోదా గురించి తెలుసుకుంది.
అసలు ఏమిటీ ప్రతిపక్ష హోదా :
ప్రజాస్వామ్య పాలనలో దేశ పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలదే కీలక పాత్ర. ప్రభుత్వ చట్టాలు, పాలనాపరమైన నిర్ణయాలకు వీటి ఆమోదం తప్పనిసరి. ప్రజలచేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ ప్రతినిధులే పార్లమెంట్, అసెంబ్లీల్లో సభ్యులుగా వుంటారు.
అయితే అధికార పార్టీ, ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా నిలువరించేదే ప్రతిపక్షం. ఎప్పటికప్పుడు ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడమే ప్రతిపక్షం పని. అధికార పార్టీ తర్వాత అత్యధిక సీట్లు దక్కిన పార్టీ లోక్ సభలోనూ, అసెంబ్లీల్లోనూ ప్రతిపక్షంగా పనిచేస్తుంది.
సాధారణంగా పార్టీల అధినేతలనే ప్రతిపక్ష నేతలుగా పేర్కొంటారు...కానీ ఇది నిజం కాదు. సభలో సరైన సంఖ్యాబలం కలిగి స్పీకర్ చేత గుర్తింపబడితేనే వారు పతిపక్ష నేతలు... ఇలా కాకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలను ముందుండి నడిపేవారిని ప్లోర్ లీడర్ అంటారు... వీరిని ఆయా పార్టీల నియమించుకుంటాయి. ప్రతిపక్ష నేతను మాత్రం తగిన సంఖ్యాబలం కలిగిన పార్టీ సూచించిన వ్యక్తిని స్పీకర్ నియమిస్తారు.
ప్రతిపక్ష నేతకు పవర్స్ వుంటాయా..?
ప్రతిపక్ష నేతగా స్పీకర్ ద్వారా గుర్తింపుపొందిన నాయకుడికి ప్రత్యేక పవర్స్, సదుపాయాలు వుంటాయి. ప్రతిపక్ష నేతకు మంత్రితో సమానమైన హోదా, గౌరవం దక్కుతుంది... వీరికి ప్రోటోకాల్ కూడా వుంటుంది. మంత్రులకు ఇచ్చే స్థాయిలోనే అలవెన్సులు, వేతనాలు, వుంటాయి. అంటే అధికార పార్టీకి చెందినవారు కాకపోయిన ప్రతిపక్ష నేత ఓ మంత్రిపొందే సౌకర్యాలన్నీ పొందుతారన్నమాట.
ఇక పార్లమెంట్, అసెంబ్లీ మావేశాల సమయంలో ప్రతిపక్ష నేతలకు ముందువరుసలో సీటు కేటాయిస్తారు. లోక్ సభలో అయితే ప్రధాని, అసెంబ్లీల్లో అయితే ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నేతకు ఎక్కువగా మాట్లాడే అవకాశం దక్కుతుంది. పార్లమెంట్, అసెంబ్లీ కమిటీల ఏర్పాటు సమయంలో ప్రతిపక్ష నేత అభిప్రాయాన్ని తీసుకుంటారు. ప్రత్యేక గదిని, సిబ్బందిని కూడా ప్రతిపక్ష నేతకు కేటాయిస్తారు. మంత్రి స్థాయిలోనే ప్రతిపక్ష నేతకు సెక్యూరిటీ వుంటుంది.
ఇలా కొన్ని అధికారులు వుంటాయి... ప్రోటోకాల్ వుంటుంది... తగిన గౌరవం దక్కుతుంది కాబట్టి వైసిపి అధినేత వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా కోరుతున్నారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అయితేనే అసెంబ్లీకి వచ్చే అవకాశాలుంటాయి... లేదంటే ఆయన సమావేశాలకు దూరంగా వుండవచ్చు. సాధారణ ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ అసెంబ్లీ రావడం అనుమానమే.