ఆది మంత్రయితే కడప టిడిపిలో తిరుగుబాటు?

First Published Apr 1, 2017, 10:12 AM IST
Highlights

ఫిరాయింపుదారుడిని మంత్రిని చేస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే మేడా హెచ్చరిక

క్యాబినెట్ విస్తరణ తర్వాత కడప జిల్లా టిడిపిలో తిరుగుబాట్లు భగ్గు మంటుందా?

 

దీనికి సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి.

 

 వైసిసి ఎమ్మెల్యే సి అదినారాయణ రెడ్డి పార్టీలోకి ఫిరాయించినప్పటినుంచి చాలా కష్టంగా సర్దుకు పోతున్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గం తిరబడే అవకాశం ఉంది. నారాయణ రెడ్డికి మంత్రిపదవి ఇస్తే రామసుబ్బారెడ్డి మౌనంగా కూర్చునే పరిస్థితి లేనే లేదు. తనకు  ఏ హోదా ఇవ్వక పోయినా పర్వాలేదు గాని నారాయణ రెడ్డికి  ఇస్తే  మాత్రం  ఆయన పెద్ద గొడవ చేసేయనున్నాడు. ‘ఆదినారాయరెడ్డికి మంత్రి పదవి ఇస్తున్నట్లు నాకు ఎలాంటి సమాచారం లేదు.  ఆయన టిడిపి చేరే రోజునే నా  అభిప్రాయం ఏమిటో  అధిష్టానానికి తెలియ చేశాను,’ అని ఆయన ఈ రోజు అమరావతిలో విలేకరులతో అన్నారు.

 

ఆయనను మచ్చిక చేసుకునేందుకు ఆర్టీసీ చైర్‌మన్‌ పదవి ఇచ్చేందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రతిపాదించాడని దానిని ఆయన తిర స్కరించారని తెలిసింది. చంద్రబాబు నాయుడి తరపున కడప జిల్లా ఇన్ చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు  కొద్ది సేపటికిందట రామసుబ్బారెడ్డితో మంతనాలాడారు.

 

అర్టీసి ఛెయిర్మన్ పదవిని తిరస్కరించడమే కాకుండా, అదినారాయణరెడ్డికి  మంత్రి పదవి ఇస్తే తానుపార్టీ కి గుడ్ బై చెబుతానని గంటాతో రామసుబ్బారెడ్డి తెగేసి చెప్పాడు.

 

‘పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారికి అవకాశం ఇవ్వాలి. చంద్రబాబు నాయుడి నాయకత్వం బలపడేవిధంగా నిర్ణయాలు జరగాలన్నది నా అభిమతం,’ అని ఆయన చెప్పారు.

 

జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న  వారిలో రాజంపేట ఎమ్మెల్యే  మేడా మల్లికార్జున రెడ్డి కూడా  ఉన్నారు.  ఆయన కూడా సీఎంను కలుసుకుని  కేబినెట్‌లో తనకు స్థానం కల్పించాలని కోరారు.   అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఫిరాయింపుదారులకు అవకాశం ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

 

 

click me!