లోకేష్ ఒక్కడి కోసమే విస్తరణా?

First Published Apr 1, 2017, 9:57 AM IST
Highlights

ఈ రోజా రాత్రిలోగా కసరత్తు కొలిక్కి రాకపోతే, వర్గాల మధ్య రాజీ కుదరకపోతే రేపటి విస్తరణ ఒక్క లోకేష్ కు మాత్రమే పరిమితమైనా ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా సమాచారం.

మంత్రివర్గ విస్తరణ లోకేష్ కు మాత్రమే పరిమితమవుతుందా? పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే, మంత్రివర్గంలో నుండి ఎవరిని తీయాలన్నా బెదిరింపే, పోనీ కొత్తగా ఫలానా వాళ్ళని తీసుకోవాలన్నా బెదిరింపులే. ఈ బెదిరింపులతో గడచిన రెండు రోజులుగా చంద్రబాబు విసిగిపోయినట్లు పార్టీలోని అత్యున్నత వర్గాలు చెబుతున్నాయ్. దాంతో ఎవరినీ తొలగించకుండా లోకేష్ ను తప్ప ఇంకెవరినీ తీసుకోకుండా ఉంటే ఎలాగుంటుందని తాజాగా చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ఈ రోజా రాత్రిలోగా కసరత్తు కొలిక్కి రాకపోతే, వర్గాల మధ్య రాజీ కుదరకపోతే రేపటి విస్తరణ ఒక్క లోకేష్ కు మాత్రమే పరిమితమైనా ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా సమాచారం.

ఫిరాయింపులను ప్రోత్సహించటంలో అప్పటి అవసరం తీరితే చాలని పలువురికి మంత్రి పదవులను చంద్రబాబు ఎరవేసారు. దాంతో వారంతా ఇపుడు తమకు మంత్రిపదవులు ఇచ్చి తీరాల్సిందేనంటూ నెత్తిన కూర్చున్నారు. ఫిరాయింపులకు మంత్రిపదవులు ఇస్తే ఊరుకునేది లేదని సీనియర్ నేతలు ప్రతిఘటిస్తున్నారు. దాంతో రెండు వర్గాల మధ్య ఏ విధంగా రాజీ చేయాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు. ఇది ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాదు. దాదాపు అన్నీ జిల్లాల్లోనూ ఇదే పరిస్ధితి.

నిజానికి మంత్రివర్గంలోకి తీసుకోవాలన్నా, తొలగించాలన్నా చంద్రబాబు ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదు.కానీ ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోయింది. కారణాలేవైనా మంత్రివర్గంలో నుండి డ్రాప్ చేసినవాళ్లల్లో ఫిరాయింపులను వ్యతిరేకిస్తున్న వారిలో ఎవరైనా వైసీపీలో చేరితో చంద్రబాబుకే ఇబ్బంది. అందుకనే అందరినీ బ్రతిమాలుకుంటున్నారు. చంద్రబాబు బ్రతిమలాడుకుంటున్నారు కాబట్టి అందరూ కొండెక్కి కూర్చుంటున్నారు. దాంతో విస్తరణ లోకేష్ కు మాత్రమే పరిమితం చేస్తే ఎలాగుంటుందని కూడా ఆలోచిస్తున్నట్లు సమాచరం. నిజంగా అదే జరిగితే, భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సిందే.

click me!