sankranthi 2022: సంక్రాంతి భోగి మంట‌లు ఎందుకు వేస్తారో తెలుసా?

By Mahesh Rajamoni  |  First Published Jan 12, 2022, 3:56 PM IST

sankranthi 2022: ద‌క్షిణ భార‌తంలో జ‌రుపుకునే అతి పెద్ద పండుగ‌ల్లో  సంక్రాంతి ఒకటి.  రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ద‌క్షిణ భార‌తంలోని చాలా ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ‌ను జ‌రుపుకుంటారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పెద్ద ఎత్తున ఘ‌నంగా జ‌రుపుకుంటారు. అయితే, సంక్రాంతి పండ‌గలో భోగి మంట‌లు, భోగి పళ్ల‌కు ప్ర‌ముఖ స్థానం ఉంది. వీటిపై అనేక  ఆసక్తికర కథనాలు సైతం ప్రచారంలో ఉన్నాయి. 
 


sankranthi 2022: ద‌క్షిణ భార‌తంలో జ‌రుపుకునే అతి పెద్ద పండుగ‌ల్లో  సంక్రాంతి ఒకటి. సంక్రాంతిని తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘ‌నంగా జరుపుకుంటారు. మూడు నుంచి నాలుగు రోజుల పాటు పెద్ద ఎత్తున సంక్రాంతిని జ‌రుపుకుంటారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండగ నిర్వహిస్తారు. అయితే, ఈ సంక్రాంతి అన‌గానే మొద‌ట గుర్తొచ్చేది భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, అందులో పెట్టే గొబ్బెమ్మ‌లు, కోళ్ల పందేలు, గాలి ప‌టాలు. ఆంధ్రప్రదేశ్‏లో పెద్ద ఎత్తున సంక్రాంతిని జరుపుకుంటారు. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ పండగను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకుంటారు. బంధువులు, కుటుంబ సభ్యుల‌తో సంక్రాంతి కోలాహ‌లం మాములుగా ఉండ‌దు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండగ నిర్వహిస్తారు. అయితే, మూడు రోజులు ఎంతో ఘ‌నంగా జ‌రుపుకునే సంక్రాంతి పండుగ‌లో భోగి మంటలు, భోగి ప‌ళ్ల‌కు కొన్ని ప్ర‌త్యేకత‌లు ఉన్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సంక్రాంతి పండుగ‌ను మూడు రోజులు జ‌రుపుకుంటారు. సంక్రాంతి పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు. రెండో రోజును మకర సంక్రాంతిగా, మూడో రోజును కనుమగా పిలుస్తారు. ప‌లు ప్రాంతాల్లో సంక్రాంతిని నాలుగు రోజులుగా కూడా జ‌రుపుకుంటారు. సంక్రాంతి నాలుగో రోజును ముక్కనుమగా పేర్కొంటారు. భోగితో సంక్రాంతి పండుగ ప్రారంభం అవుతుంది. భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేసి తెల్ల‌వారు జామున మంట‌లు వేయ‌డం చాలా కాలం నుంచి వ‌స్తున్న ఆచారం. హిందూ పురాణాల ప్రకారం..  సూర్యుడి దక్షిణ యానానికి చివరి రోజు.. మ‌క‌ర రాశిలోకి ప్ర‌వేశించే ముందు కాలంలో భోగిని జ‌రుపుకుంటారు. దీని కంటే ముందు ప్రతి ఒక్కరూ ఎదుర్కొన్న కష్టనష్టాలు, బాధలన్నీ మంటల రూపంలో పూర్తిగా తొలగిపోవాలని అగ్ని దేవుడిని ప్రార్థిస్తారు. ఈ క్ర‌మంలోనే భోగి మంట‌లు వేసే ఆచారం వ‌చ్చింద‌ని చెబుతుంటారు. అంటే రాబోయే ఉత్తరయాన కాలంలో తమ సంపద, ఆరోగ్యం, శ్రయేస్సు పెరగాలని ఉద్దేశంతో ఈ భోగి మంట‌లు వేస్తార‌న్న‌మాట‌..! 

Latest Videos

undefined

సంక్రాంతి పండుగ రోజుల్లో చిన్నారులపై భోగి పళ్లను కూడా పోస్తారు. దీనిపై ప‌లు ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు ఉన్నాయి. సంక్రాంతి పండుగ ప్రారంభమైన భోగి రోజునే అనేక కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటారు. వాటిలో బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం చేయ‌డం, చిన్నారుల‌పై భోగి ప‌ళ్ల‌ను పోయ‌డం కూడా ఉంటాయి. భోగి  నాడు ఉద‌యం భోగి మంట‌లు వేయ‌గా,  సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై  భోగిప‌ళ్లు పోస్తారు. చిన్నారుల‌పై పోసే భోగిపండ్ల‌ల్లో రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు, శనగలు ఉంటాయి.  సంక్రాంతి పండుగ ప్రారంభ రోజు సాయంత్రం చిన్నారుల తల మీద భోగి పండ్లు పోయ‌డం వ‌ల్ల హిందూ దేవ‌త‌లైన త్రిమూర్తుల్లో ఒక‌రైన  శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు అందుతాయ‌ని భావిస్తారు.

 అలాగే,  భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపొతుంద‌ని న‌మ్మ‌కం. అందుకే చిన్నారుల‌పై భోగి పళ్లు పోస్తారు. మ‌రికొంద‌రు చెబుతున్న మాట ఏమిటంటే తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంద‌నీ,  భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంద‌ని న‌మ్మ‌కం. అందుకే భోగి నాడు పిల్ల‌ల త‌ల‌పై భోగి పళ్లు పోస్తారు. ప్ర‌చారంలో ఉన్న మ‌రో క‌థ‌నం ప్ర‌కారం.. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద రేగు పండ్ల‌ను కురిపించార‌నీ, అందుకే పిల్ల‌ల‌ను శ్రీ‌మ‌న్నారాయ‌ణుడిగా భావించి వారిపై భోగి పండ్లు పోస్తార‌ట‌.. ! 

click me!