హోదా కోసం ఎలుగెత్తిన యువత

First Published Jan 27, 2017, 7:00 AM IST
Highlights

రాష్ట్రవ్యాప్తంగా ఎప్పుడైతే యువత ఎక్కడికక్కడ రోడ్లపైకి రావటం మొదలు  పెట్టారో  చంద్రబాబు ఖంగుతిన్నారు. ఇంతస్ధాయిలో హోదాకు అనుకూలంగా యువత స్పందిస్తారని చంద్రబాబు అనుకోలేదేమో.

ప్రత్యేకహోదా కోరుతూ రాష్ట్రంలోని యువత మొత్తం రోడ్డెక్కటంతో చంద్రబాబునాయుడు ఖంగుతిన్నారు. హోదాపై యువతలో ఈ స్ధాయిలో తపన ఉందన్న విషయం మొదటిసారిగా బయటపడింది. గతంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఆందోళనలు చేసారు. అయితే, ఆ ఆందోళనల్లో పాల్గొన్న యువత వైసీపీ అంటే అభిమానం ఉన్నవారో లేదా కార్యకర్తలో. హోదా సాధనపై యువత ఇంత స్ధాయిలో తపనపడుతున్నారన్న విషయం జల్లికట్టు తర్వాతే బయటపడింది.

 

ఉద్యమానికి ఏ రాజకీయ పార్టీ కూడా పిలుపివ్వలేదు. ఏ రాజకీయపార్టీ కూడా ఉద్యమానికి నాయకత్వం వహించలేదు. కేవలం సోషల్ మీడియా వేదికగానే యువత సమాయత్తమయ్యారు. యావత్ యువతను సంఘటితం చేసిన  ఘనత సోషల్ మీడియాదే. యువత ఓ వైపు ఉద్యమానికి సమాయత్తమవుతుంటే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో పాటు పలు రాజకీయపార్టీలు మద్దతు ప్రకటించాయి.

 

ఎప్పుడైతే రాజకీయ పార్టీలు సానుకూలంగ స్పందించటం మొదలుపెట్టాయో చంద్రబాబు ఉలిక్కిపడ్దారు. రాజకీయ పార్టీల నేతలను అదుపులోకి తీసుకుంటే సరిపోతుందని పోలీసులు కూడా తొలుత భావించారు. అయితే, గురువారం ఉదయం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఎప్పుడైతే యువత ఎక్కడికక్కడ రోడ్లపైకి రావటం మొదలు  పెట్టారో  చంద్రబాబు ఖంగుతిన్నారు. ఇంతస్ధాయిలో హోదాకు అనుకూలంగా యువత స్పందిస్తారని చంద్రబాబు అనుకోలేదేమో. దాంతో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండానే యువత సంఘటితం కాగలదని తెలిసివచ్చింది. యువత మూడ్ ను చూసిన తర్వాత రాజకీయపార్టీలే ఉద్యమంలోకి దూకాయి.

 

దానికితోడు ఉద్యమంలో పాల్గొన్న యువత మొత్తం చంద్రబాబునాయుడు లక్ష్యంగా ఆరోపణలుల గుప్పించటం గమనార్హం. ప్రత్యేకహోదా వల్లే వచ్చే లాభాలు, ప్యాకేజి వల్ల వచ్చే నష్టాల గురించి చంద్రబాబు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పటం విశేషం. ఎందుకంటే, చంద్రబాబు ఇంతకాలం హోదా కన్నా ప్యాకేజీనే మిన్న అంటూ చెప్పుకుని తిరుగుతున్నారు. అంతేకాకుండా హొదా వల్ల వచ్చే అదనపు ప్రయోజనాలేమిటో ఎవరైనా తనను ఎడ్యుకేట్ చేయమని పదే పదే మీడియాలో చెబుతున్నారు. దానికి సమాధానంగానే యువత హోదాపై మట్లాడటంతో హోదా పట్ల యువత పట్టుదల చంద్రబాబుకు బాగానే అర్ధమైంది.

click me!