
శాసనవ్యవస్ధకు రాజ్యాంగం కల్పించిన రక్షణ ముసుగులో స్పీకర్ అధికారాలను ఎవరూ ప్రశ్నించేందుకు లేదా? ఇలా ఎంత కాలమని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీల చేతిలో ప్రజాస్వామ్యం ఖూని అవుతున్నా అందరూ చూస్తు కూర్చోవాల్సిందేనా అన్న ప్రశ్న అందరి మదిని తొలిచేస్తోంది. తెలంగాణా శాసనసభలో ఫిరాయింపుల వ్యవహారంపై తాజాగా సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలతో స్పీకర్ అధికారాలపై సర్వత్రా చర్చ మొదలైంది.
విచిత్రమేమిటంటే తెలుగు రాష్ట్రాల్లోనూ శాసనవ్యవస్ధ ఒకే విధంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంఎల్ఏలను ఇద్దరు ముఖ్యమంత్రులూ తమ పార్టీల్లోకి లాక్కోవటాన్ని అందరూ చూస్తూనే ఉన్నారు. శాసనసభ్యుల ఫిరాయింపులపై ఆయా పార్టీలు ఇస్తున్న ఫిర్యాదులను తీసుకోవటం మినహా స్పీకర్లు ఎటువంటి నిర్ణయం తీసుకోవటం లేదు.
ముఖ్యమంత్రుల ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నంత కాలం స్వతంత్రంగా స్పీకర్లు నిర్ణయం తీసుకుంటారని ఆశించటం కూడా దండగే. తమ పార్టీలో నుండి అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయమని ఒకటికి పదిసార్లు ఆయా పార్టీలు మొత్తుకుంటున్నా పట్టించుకుంటున్న నాధుడే లేడు.
ఎంతమంది ఈ విషయమై న్యాయస్ధానాల మెట్లు ఎక్కుతున్నా ఏమాత్రం ఉపయోగం కనబడటం లేదు. న్యాయస్ధానాల మెట్టు ఎక్కి దిగటంలోనే ఐదేళ్ళూ అయిపోతున్నాయే కానీ పిటీషన్లపై మాత్రం న్యాయస్ధానాలు స్పందించటం లేదు. ఎందుకంటే, శాసనవ్యవస్ధను శాసించే అధికారం తమకు లేదన్న ఒకే ఒక కారణంతో స్పీకర్ చేష్టలను న్యాయస్ధానాలు చూస్తు ఉరుకోవాల్సి వస్తోంది.
ఇదే అంశం రెండు రాష్ట్రాల్లోని అధికార తెలంగాణా రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీలకు బాగా కలసి వచ్చింది. ఎంఎల్ఏల ఫిరాయింపులన్నది ఇపుడే మొదలైంది కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిఎంగా ఉన్నపుడు కూడా జరిగింది. కాకపోతే ఇపుడు పతాకస్ధాయికి చేరుకుంటోంది. తాజాగా సుప్రింకోర్టు ద్విసభ్య బెంచ్ చేసిన వ్యాఖ్యలు నిజంగా అధికార పార్టీలు సిగ్గుతో తలవంచుకోవాల్సిందే. ‘ఫిరాయింపులపై స్పీకర్ చర్యలు తీసుకుంటారన్న నమ్మకం తమకు లేద’ని సుప్రింకోర్టు ఘాటు వ్యాఖ్యలే చేసింది.
ఫిరాయింపులన్నది నైతికతకు సంబంధించిన విషయం. ఏ కారణంతో పార్టీ మారాలని అనుకున్నా, వెంటనే పార్టీకి, పార్టీ ద్వరా సంక్రమించిన పదవులకు రాజీనామాలు చేసి తమకు నచ్చిన పార్టీల్లోకి వెళ్ళటమన్నది నైతిక బాధ్యత. నైతిక విలువలను వలువలు విడిచేసినంత తేలిగ్గా వదిలేస్తుంటే, పార్టీ అధినేతలు అందుకు దగ్గరుండి ప్రోత్సహిస్తుంటే ఎవరిని అనుకునీ ఏమీ లాభం లేదు.
అయితే, ఎలాగూ సుప్రింకోర్టులో చర్చ మొదలైంది గనుక ఏదో ఒక రూపంలో శాసనవ్యవస్ధ అధికారాల్లో ప్రత్యేకించి స్పీకర్ కున్న అసాధారణ అధికారాలపై ఏదో ఒక చెక్ పెట్టాల్సిన అవసరం అయితే ఉందన్నది ప్రజాస్వామ్య వాదుల వాదన.