
హైదరాబాద్‌లో ఈ తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ కుమారుడునిషిత్ చనిపోయాడు..
ఈ ప్రమాదంలో అతడి స్నేహితుడు రాజా రవివర్మ మరణించాడు.
నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో ఈ ప్రమాదం జరిగింది.
మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న బెంజ్ కారు వేగంగా వచ్చి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది(పై పోటో,కింది ఫోటో). నిషిత్ ప్రయాణించిన బెంజ్ కారు నెంబర్ టీఎస్ 07 ఎఫ్‌కే 7117 అని సమాచారం. దీంతో కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన ఇద్దరిని స్థానికులు అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఏడాదే నారాయణ గ్రూప్స్ డైరెక్టర్‌గా నిశిత్ బాధ్యతలు చేపట్టారు. ఏపీ మంత్రి నారాయణ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు.
ఉప ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి
పురపాలక శాఖ మంత్రి నారాయణ తనయుడు నిశిత్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపట్ల ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మంత్రి నారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన చినరాజప్ప. ప్రమాద సమాచారం తెలియగానే సంఘటనా ప్రాంతానికి వెళ్లారు.
నేటి తూర్పుగోదావరి జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు.
ప్రతిపక్ష నేత దిగ్భ్రాంతి
ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నిషిత్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నారాయణ కుటుంబానికి సంతాపం తెలిపారు.