చిరంజీవికి బిజెపి ఆహ్వానం: క్లారిటీ ఇచ్చిన సోము వీర్రాజు

By telugu teamFirst Published Aug 8, 2020, 6:58 AM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవిని బిజెపి నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టత ఇచ్చారు.

అమరావతి: మాజీ పార్లమెంటు సభ్యుడు మెగాస్టార్ చిరంజీవిని బిజెపి నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు తమ పార్టీలోకి రావాల్సిందిగా కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల సోము వీర్రాజు చిరంజీవిని కలిసిన విషయం తెలిసిందే. దీంతో ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఆ విషయంపై సోము వీర్రాజు స్పష్టత ఇచ్చారు. 

చిరంజీవిని బిజెపిలోకి ఆహ్వానించలేదని సోము వీర్రాజు చెప్పారు. కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే తాను చిరంజీవిని కలిసినట్లు ఆయన తెలిపారు. జనసేన, బిజెపి కలిసి ప్రజా సమస్యలపై పోరాడాలని చిరంజీవి సూచించినట్లు ఆయన తెలిపారు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి 18 శాతం ఓట్లు వచ్చాయని, జనసేనకు 7 శాతం ఓట్లు వచ్చాయని, భవిష్యత్తులో తమకు అవి అనుకూలంగా మారుతాయని ఆయన చెప్పారు. 

వైసీపీ, టీడీపీలు రెండు కూడా కుటుంబ పార్టీలేనని సోము వీర్రాజు అన్నారు. అమరావతి రైతుల పక్షాన తాము జనసేనతో కలిసి పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. త్వరలో బిజెపిలోకి పెద్ద యెత్తున వలసలు ఉంటాయని ఆయన చెప్పారు. వివిధ వర్గాలవారిని కలిసి తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నామని ఆయన చెప్పారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని, వీవీ లక్ష్మినారాయణ వంటి వారిని కూడా కలుుస్తామని ఆయన చెప్పారు. 

చిరంజీవిని కలిసిన తర్వాత సోము వీర్రాజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా కలిశారు. పవన్ కల్యాణ్ తో కలిసి ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. 

click me!