
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయసాయిరెడ్డికి సోషల్ మీడియా వేదికగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రతి ఏటా రైతులకు రూ. 6 వేల పెట్టుబడి సాయం మూడు వాయిదాల్లో అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్‌లో భాగంగా ఫిబ్రవరి 27న రైతుల ఖాతాల్లో 13వ విడత కింద అర్హులైన రైతుల ఖాతాల్లో రూ. 2 వేల చొప్పున ప్రధాని మోదీ జమ చేశారు. ఇందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
‘‘ప్రధాని మోదీ తన ఫ్లాగ్‌షిప్ పీఎం-కిసాన్ కింద రైతుల కోసం రూ. 16,800 కోట్లు విడుదల చేశారు. వ్యవసాయ రంగానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. 8 కోట్ల మంది రైతులకు నేరుగా ఒక్కొక్కరికి రూ. 2, 000, సంవత్సరానికి రూ.6, 000 అందుతున్నాయి. మోదీ బ్రెయిన్ చైల్డ్ అయిన ఈ పథకాన్ని నేను అభినందిస్తున్నాను’’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
అయితే విజయసాయిరెడ్డి ట్వీట్‌పై స్పందించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. సంవత్సరానికి 6000 కోట్లు మాత్రమే కాదని అనేక పథకాలను కేంద్రం అమలు చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల జాబితాను పోస్టు చేశారు.
ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన, ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డ్ , ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ఇ - నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, ప్రధాన మంత్రి భారతీయ జన్ ఉర్వారక్ పరియోజన, ప్రధానమంత్రి కుసుమ్ యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషి ఉడాన్ యోజన, భూసార పరీక్షా కార్డులు, ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ యోజన, ప్రధానమంత్రి శ్రమ యోగి మంధన్ యోజన, కిసాన్ రైల్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, విత్తన శుద్ధి నాణ్యత, గోబర్ ధన్ యోజన, వన్ ధన్ యోజన, కనీస మద్దతు ధర, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, కిసాన్ రాత్, ప్రధానమంత్రి కృషి సించాయు యోజన, పరం పరాగత్ కృషి వికాస్ యోజన, అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్, ప్రధానమంత్రి లైవ్ స్టాక్ డిసీజెస్ కంట్రోల్ స్కీమ్, నేషనల్ బాంబు మిషన్ అండర్, అన్నదాత ఆమ్ సన్ రక్షణ అభియాన్, నీమ్ కోటెడ్ యూరియా వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ లాంటి అనేక పథకాలు రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని సోము వీర్రాజు పేర్కొన్నారు.