
విశాఖపట్నంలోని సిరిపురం జంక్షన్‌లో జీవీఎంసీ సిబ్బందిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు నగరంలో పలుచోట్ల ఆ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే సిరిపురం జంక్షన్ ద్రోణంరాజు సర్కిల్ వద్ద బీజేపీ జెండాలను జీవీఎంసీ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో అటుగా వెళ్తున్న సోము వీర్రాజు ఆ దృశ్యాలను గమనించి.. జీవీఎంసీ సిబ్బంది వద్దకు చేరుకున్నారు. బీజేపీ జెండాలను ఎందుకు తొలగిస్తున్నారని జీవీఎంసీ సిబ్బందిని నిలదీశారు. అయితే నిబంధనల ప్రకారమే తాము చర్యలు చేపడుతున్నామని జీవీఎంసీ సిబ్బంది తెలిపారు.
అయితే జెండాలను ఇష్టంవచ్చినట్టుగా తీసేస్తారా? అని సోము వ్రీరాజు వారిని ప్రశ్నించారు. వాహనంలో వేసిన బీజేపీ జెండాలను బయటకు తీశారు. రెండు రోజులు జెండాలు ఉంచేందుకు కష్టమేమిటని ప్రశ్నించారు. తాను జీవీఎంసీ కమిషనర్‌తో మాట్లాడతానని అన్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేలా పార్టీ జెండాల ఏర్పాటుకు సంబంధించి జీవీఎంసీ కమిషనర్‌తో తమ పార్టీ ఎంపీ జీవీఎల్ ఇదివరకే మాట్లాడారని తెలిపారు. మరోవైపు ఈ విషయం తెలిసి పలువురు బీజేపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో ద్రోణం రాజు సర్కిల్ వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక, ప్రధాని నరేంద్ర మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీకానుండటంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. దీనిపై పలు పార్టీల నేతలు రకరకాలు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. తాము కుటుంబ, అవినీతి పార్టీలకు వ్యతిరేకమన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తమ విధానం ఇలాగే వుంటుందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రధానితో కోర్ కమిటీ జరిపే సభ్యుల సమావేశంలోనూ ఇదే చర్చ జరుగుతుందన్నారు. మోడీ- పవన్ భేటీలో రాజకీయ పరమైన అంశాలు చర్చకు వస్తాయని సోము వీర్రాజు తెలిపారు.