బీసీలను ఆదుకోండి, ఆ హక్కులు మత్స్యకార సొసైటీలకే ఇవ్వండి: జగన్‌కు చంద్రబాబు లేఖ

By Siva KodatiFirst Published Sep 5, 2021, 7:27 PM IST
Highlights

బీసీ సంక్షేమం- కుల వృత్తులు, చేతివృత్తుల వారి ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ ఆదివారం ముఖ్యమంత్రి జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. మత్స్యకారుల ఉనికికి గొడ్డలిపెట్టులా ఉన్న జీవో నెం.217ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

గడిచిన రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో బీసీల సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రశ్నార్థకమైందన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. అనాదిగా కులవృత్తులపై ఆధారపడిన వారి ఎదుగుదల దెబ్బతిందని ఆయన ధ్వజమెత్తారు. బీసీ సంక్షేమం- కుల వృత్తులు, చేతివృత్తుల వారి ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ ఆదివారం ముఖ్యమంత్రి జగన్‌కు చంద్రబాబు లేఖ రాశారు. మత్స్యకారుల ఉనికికి గొడ్డలిపెట్టులా ఉన్న జీవో నెం.217ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే చెరువులు, కాలువలు, రిజర్వాయర్లపై పూర్తి హక్కులను మత్స్యకార సొసైటీలకే అప్పగించాలని చంద్రబాబు సూచించారు. 

చేపల వేటే ప్రధాన వృత్తిగా జీవనం సాగించే మత్స్యకారులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. వారి వృత్తిని, జీవనాన్ని నాశనం చేసేలా తీసుకొచ్చిన జీవోను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. నిధులు, విధులు లేని కార్పొరేషన్ల ఏర్పాటుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోందని.. రెండేళ్లలో కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా రూపాయి రుణం ఇవ్వలేదని చంద్రబాబు దుయ్యబట్టారు. అలాగే కొత్త ఉపాధి అవకాశాలూ కల్పించలేదని మండిపడ్డారు. బీసీ సబ్‌ ప్లాన్‌ను నిర్వీర్వం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో మత్స్యకారులకు సబ్సిడీ పథకాలు అందించడం లేదని.. తుపాన్లతో నష్టపోయిన వారికి ఎలాంటి భరోసా ఇవ్వలేదని చంద్రబాబు విమర్శించారు. 

మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ప్రభుత్వం తోడ్పాటు అందించాలని చంద్రబాబు ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశారు. సొసైటీలను నిర్వీర్యం చేస్తూ మత్స్యకారుల్ని రోడ్డున పడేసేలా వ్యవహరించడం సరికాదని సీఎం హెచ్చరించారు. దేశానికే ఆక్వా హబ్‌గా నిలవాల్సిన రాష్ట్ర మత్స్యరంగం.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, విధానాలతో ప్రశ్నార్థకమైందని టీడీపీ అధినేత ఆవేదన వ్యక్తం చేశారు. 

click me!