
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు పలు సందర్భాల్లో బహిర్గతం అవుతున్నాయి. తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే ఓ కీలక నేతకు వ్యతిరేకంగా ఆయన ప్రత్యర్థి వర్గం మద్దతుదారులు నినాదాలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో పర్యటించారు. అయితే చంద్రబాబు పర్యటనలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు ప్రత్యర్థి వర్గం నుంచి నిరసనలు ఎదురయ్యాయి.
సామర్లకోట మండలం వెట్లపాలెం గ్రామంలో టీడీపీ సీనియర్ నేత దివంగత బొడ్డు భాస్కర రామారావు విగ్రహావిష్కరణకు చంద్రబాబు నాయుడు, చినరాజప్పతో పాటు పలువురు పార్టీ నేతలు చేరుకున్నారు. చంద్రబాబుతో కలిసి చినరాజప్ప వేదిక ఎక్కుతుండగా దివంగత బొడ్డు భాస్కర రామారావు కుమారుడు బొడ్డు వెంకట రమణ చౌదరి అనుచరులు కొందరు చినరాజప్పకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చినరాజప్ప గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బొడ్డు వెంకట రమణ చౌదరి పార్టీ టిక్కెట్టు ఇవ్వాలని చంద్రబాబును డిమాండ్ చేశారు.
అయితే పెద్దాపురం టిక్కెట్టు మూడోసారి కూడా చినరాజప్పకే దక్కుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయనకు అన్ని వర్గాల్లోని కార్యకర్తలు సహకరించాలని చెప్పారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత బొడ్డు వెంకట రమణ చౌదరికి, మరో టీడీపీ నేత గుణ్ణం చంద్రమౌళికి తగిన పదవులు ఇస్తానని తెలిపారు. రాష్ట్రంలో అధికార వైసీపీని ఓడించడంపై దృష్టి పెట్టాలని పార్టీ క్యాడర్‌కు చంద్రబాబు పిలుపునిచ్చారు.
టీడీపీలో చేరిన మహాసేన రాజేష్..
సామర్లకోటలో తన పర్యటన సందర్భంగా చంద్రబాబు అక్కడ షెడ్యూల్ కులాల వారితో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మహాసేన అధ్యక్షుడు రాజేష్ తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఎస్సీలకు ద్రోహం చేశారనే తప్పుడు భావనతో జగన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు తాను, ఇతర ఎస్సీలు వైసీపీకి మద్దతిచ్చామని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలకు వైసీపీ ద్రోహం చేసిందని తెలుసుకున్నట్టుగా తెలిపారు.
ఇదిలా ఉంటే.. శుక్రవారం చంద్రబాబు నాయుడు అనపర్తి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు రోడ్ షో వేయవచ్చని.. అయితే రోడ్డుపై బహిరంగ సభలు పెట్టవద్దని పోలీసులు టీడీపీ నేతలకు స్పష్టం చేశారు. వీరి ప్రతిపాదనకు అనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి నాయుడుతో పాటు ఇతర నాయకులు అంగీకరించలేదు. ఇక, బలభద్రపురం గ్రామం వద్ద అనపర్తికి వెళ్లే దారిని పోలీసులు మూసివేసే ప్రయత్నం చేశారు. పోలీసులు, పార్టీ నేతలతో చర్చలు జరిపిన చంద్రబాబు అనపర్తి పర్యటనకు సిద్ధమయ్యారు. ఇంతలో టీడీపీ క్యాడర్ రోడ్డుపై పోలీసులు ఉంచిన బారికేడ్లను తోసివేయడంతో చంద్రబాబు ముందుకు సాగారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో మహాత్మాగాంధీ దండి మార్చ్ తరహాలోనే తాను కూడా దీన్ని చేస్తానని చెప్పారు. జగ్గంపేట, పెద్దాపురం పోలీసులు తన పర్యటనను అడ్డుకోలేదని.. అయితే అనపర్తి వద్ద స్థానిక ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి ఒత్తిడి కారణంగా పోలీసులు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. బలభద్రపురం నుంచి అనపర్తిలోని దేవీచౌక్ సెంటర్‌కు 6 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లిన చంద్రబాబు.. అక్కడ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. తనపై ఎందుకంత ఆంక్షలని ప్రశ్నించారు. తాను నేను పాకిస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చానా? అంటూ ఫైర్ అయ్యారు.