నెల్లూరు జిల్లా ఆదురుపల్లిలో కంపించిన భూమి.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..

By Sumanth KanukulaFirst Published Nov 7, 2022, 10:57 AM IST
Highlights

నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం ఆదురుపల్లిలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో జనం భయాందోళన చెందారు.

నెల్లూరు జిల్లా సోమవారం  ఉదయం భూమి కంపించింది. జిల్లాలోని చేజర్ల మండలం ఆదురుపల్లిలో భూమి స్వల్పంగా కంపించింది. అయితే పెద్ద శబ్దంతో భూమి కంపించడంతో స్థానికులు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆగస్టులో కూడా నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలోని కొన్ని మండలాల్లో 6 నుంచి 10 సెకన్లపాటు తేలికపాటి ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రకంపనలతో జిల్లాలోని వరికుంటపాడు, వింజమూరు, దుత్తలూరు మండలాల్లోని చాలా మంది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పెద్ద శబ్ధం వినిపించిందని, ఆ తర్వాత ప్రకంపనలు వచ్చినట్లు స్థానికకులు తెలిపారు. తమ గ్రామాల్లో అప్పుడప్పుడు ఇలాంటి ప్రకంపనలు వస్తున్నాయని వారు చెప్పారు. అయితే ఈ ప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం లేదని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ.. భూ ప్రకంపనాలు చోటుచేసుకుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 

ఇక, ఉత్తరాఖండ్‌లోని టెహ్రీలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతో భూకంపం సంభవించినట్టుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం..  ఉత్తరకాశీకి తూర్పు-ఆగ్నేయంగా 17 కిలోమీటర్ల దూరంలో 5 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనాలు సంభవించాయి. ఉదయం 8.33 గంటలకు భూకంపం సంభవించినట్టుగా ఎన్‌సీఎస్ పేర్కొంది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఎన్‌సీఎస్ పోస్టు కూడా చేసింది. 

భూకంప కేంద్రం తెహ్రీ జిల్లాలో ఉంది. అయితే రుద్రప్రయాగ్, డెహ్రాడూన్ జిల్లాల్లో కూడా భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టుగా  తెలుస్తోంది. 3 సెకన్ల పాటు భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. భూప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భయందోళనకు గురైన ప్రజలు చాలా సేపు ఇళ్లలోకి వెళ్లకుండా బయటే ఉండిపోయారు. 

click me!