కరోనా పంజా.. నా కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్: స్వయంగా ప్రకటించిన వైసీపీ ఎంపీ

By Siva KodatiFirst Published Apr 26, 2020, 6:47 PM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుల నుంచి దేశాధినేతల వరకు ఈ మహమ్మారి వదలడం లేదు. తాజాగా కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ కుటుంబంలో ఆరుగురికి కరోనా వైరస్ సోకింది. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుల నుంచి దేశాధినేతల వరకు ఈ మహమ్మారి వదలడం లేదు. తాజాగా కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ కుటుంబంలో ఆరుగురికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.

అయితే తనకు కోవిడ్ సోకలేదని, కేవలం తన సోదరుల కుటుంబంలో ఆరుగురికి మాత్రమే వచ్చిందని చెప్పారు. వీరంతా కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారని, సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని సంజీవ్ చెప్పారు.

Also Read:కరోనా:గుంటూరులో బిర్యానీ హోటల్ నిర్వాహకుడి ఫ్యామిలీ క్వారంటైన్‌కి

కరోనా వచ్చి తగ్గితేనే అందరికీ రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. కర్నూలు నగరంలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ప్రజలు భయపడుతున్నారని.. అందువల్లే వారికి పరిస్ధితి చెప్పడానికి తాను స్వయంగా ముందుకొచ్చానని సంజీవ్ కుమార్ పేర్కొన్నారు.

ప్రజలు ఎవరూ కోవిడ్ గురించి భయపడొద్దని.. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని ఆయన ధైర్యం చెప్పారు. కరోనా అంటేనే మహమ్మారి అని అమెరికా, స్పెయిన్‌ల పరిస్ధితి చూసి భయపడుతున్నారని.. కానీ మన దగ్గర అలాంటి పరిస్దితి రాదని తాను బల్లగుద్ది చెప్పగలనని సంజీవ్ కుమార్ అన్నారు.

స్వతహాగా భారతీయుల శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని ఎంపీ తెలిపారు. మన చిన్నతనంలో బీసీజీ ఇంజెక్షన్ ఇస్తారని, అది టీబీ కోసం ఇస్తారని.. అది కరోనా నుంచి కాపాడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని సంజీవ్ కుమార్ గుర్తుచేశారు.

చిన్నప్పటి నుంచి మన శరీరం వివిధ రకాల ఇన్ఫెక్షన్‌లతో పోరాడుతూనే ఉంటుందని, శరీరం కూడా అందుకు అనుకూలంగా మార్చుకుంటుందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉందని, కేసులను దాచిపెట్టాల్సిన అవసరం లేదని సంజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

Also Read:కరోనా దెబ్బ: గత నెల మాదిరిగానే ఏపీ ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పూర్తి జీతం

తాజాగా డాక్టర్లు చెబుతున్న హెర్డ్ ఇమ్యూనిటీ గురించి సంజీవ్ వివరిస్తూ.. గుంపుల్లో ఎంతమందికి ఎక్కువ రోగ నిరోధక శక్తి పెరిగితే, జబ్బు నుంచి కోలుకుంటేనే సమాజం బయటపడుతుందని ఆయన వెల్లడించారు.

అయితే  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకే లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారని, దీనిని ఒకేసారి కాకుండా దశలవారీగా ఎత్తివేయాలని సంజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు. 

click me!