
షాట్ గన్ గా పాపులర్ అయిన సినీనటుడు, భారతీయ జనతా పార్టీ ఎంపి శత్రుఘ్నసిన్హా తన రూటే సపరేటని నిరూపించుకున్నారు. తాజాగా పెద్ద నోట్ల రద్దుపై జరిగినట్లు ప్రచారంలో ఉన్న సర్వే నివేదికపై శత్రు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రధానమంత్రి ఆలోచనలకు భిన్నంగా మాట్లాడేందుకు ఎవరూ సాహసించని సమయంలో శత్రు తనదైన శైలిలో గురువారం స్పందించారు.
సర్వేపై వ్యాఖ్యానిస్తూ ‘ పిచ్చోళ్ల స్వర్గంలో విహరించటం మానుకోండి’ అని మోడికి సలహా ఇవ్వటం సంచలనంగా మారింది. పెద్ద నోట్ల రద్దుకు దేశ ప్రజలు మద్దతు ఇచ్చారనే భ్రమల్లో పార్టీ బతుకుతోందని మోడిని నేరుగానే ఎత్తి పొడిచారు. కట్టుకథలు, పిట్ట కథలు, స్వప్రయోజనాల కోసం నిర్వహించిన సర్వేలకు దూరంగా ఉండాలంటూ సిన్హా ప్రధానికి సూచించారు.
మొబైల్ యాప్ ద్వరా పెద్ద నోట్ల రద్దుపై జరిగిన సర్వేలో దేశంలోని 93 శాతం మంది మద్దతు ఇచ్చారని, కేవలం 2 శాతం మాత్రమే వ్యతిరేకించారని స్వయంగా మోడినే బుధవారం ప్రకటించారు. దానిపై గురువారం సిన్హా తీవ్రంగా స్పందిచారు. ఇదిలావుండగా, తనకు అనుకూలంగా మోడి సర్వే జరిపించుకున్నట్లు ప్రతిపక్షాలు మండిపడుతున్న సమయంలోనే సిన్హా కూడా వారికి మద్దతుగానా అన్నట్లు మాట్లాడటంతో పార్టీలో సర్వత్రా చర్చ మొదలైంది.