
పై ఫోటోను చూసారా? ముఖ్యమంత్రి కెసిఆర్ నిలబడి ఉంటే ముఖ్యమంత్రి కుర్చీలో చిన్న జియ్యర్ స్వామి కూర్చుని ఉన్నారు. ఈ దృశ్యం గురువారం సిఎం నూతన గృహప్రవేశం సందర్భంగా చోటు చేసుకున్న అరుదైన ఘటన. అరుదైన ఘటన ఎందుకంటే, ముఖ్యమంత్రి అధికారిక కుర్చీలో చిన్న జియ్యర్ స్వామి కూర్చోవటం. మామూలుగా అమయితే సిఎం కుర్చీలో మరొకరు కూర్చునేందుకు లేదు.
ఇప్పటి వరకూ ఎందరో ముఖ్యమంత్రులు కార్యాలయంలోకి ప్రవేశించేటపుడు పూజలు నిర్వహించారు. అయితే కార్యాలయంలోకి ప్రవేశించిన తర్వాత తమ కుర్చీల్లో సిఎంలు కూర్చోగానే పూజలు నిర్వహించిన వారు ఆశీర్వచనాలు ఇస్తారు. అంతే కానీ ముఖ్యమంత్రి నిలబడి ఉండగా సిఎం సీటులో ఆశీర్వచనాలు ఇచ్చిన వారు కూర్చోరు. కానీ గురువారం ఉదయం మాత్రం సీన్ రివర్స్ లో సాగింది. ముఖ్యమంత్రి దంపతులు నిలబడి వుండగా, చిన్న జియ్యర్ స్వామి సిఎం కుర్చీలో కూర్చున్నారు.
ఈ విషయాన్ని గమనించిన పలువురు పార్టీ నేతలు ‘సిఎం కుర్చీ కోసం కెసిఆర్ 12 ఏళ్ళు ఉద్యమాలు చేస్తే, చిన్న జియ్యర్ స్వామి ఎటువంటి శ్రమ లేకుండానే సిఎం కుర్చీలో కూర్చున్నారంటూ చమత్కరించారు. పైగా ఎవరినైతే బూచిగా(సీమాంధ్రులను) చూపించి ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం పోరాటం చేసారు తిరిగి వారికే కెసిఆర్ తన సీటలో కూర్చోబెట్టారంటూ ఛలోక్తులు విసరటం గమనార్హం. ప్రస్తుతం ఈఫొటో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉండటం విశేషం.