రమేష్ ఆస్పత్రికి రఘురామ తరలింపులో ట్విస్ట్: సిఐడి రివ్యూ పిటిషన్

By telugu teamFirst Published May 17, 2021, 8:12 AM IST
Highlights

వైసిపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజును రమేష్ ఆస్పత్రికి తరలించే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఆయనను రమేష్ ఆస్పత్రికి తరలించడంపై మధ్యాహ్నానికి గానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు.

అమరావతి: వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజును గుంటూరులోని రమేష్ ఆస్పత్రికి తరలించే విషయంలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. సోమవారం మధ్యాహ్నం వరకు గానీ ఆ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాకుండా రమేష్ ఆస్పత్రిలో కూడా రఘురామ కృష్ణమ రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. 

అయితే, గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు చేయించినప్పటికీ రమేష్ ఆస్పత్రికి మాత్రం ఆయనను తరలించలేదు. దీంతో రమేష్ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు జరగలేదు. ఈ విషయంపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీవ్రంగా ప్రతిస్పందించింది. రఘురామకృష్ణమ రాజును రమేష్ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. కానీ, రఘురామకృష్ణమ రాజును జిల్లా జైలుకు తరలించారు. 

Also Read: రఘురామను ఎవరూ కొట్టలేదు: వైద్యుల నివేదికలో సంచలన విషయాలు

రమేష్ ఆస్పత్రిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, రమేష్ ఆస్పత్రి నిర్వహించిన కోవిడ్ సెంటర్ లో పది మంది మరణించారని, అందువల్ల రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణమ రాజును తరలించడం సరైంది కాదని భావించామని ఏఏజీ కోర్టుకు తెలిపారు. దీంతో దానిపై పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. దీంతో సిఐడి అధికారులు సిఐడి కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. 

ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత 12.30 గంటల వరకు రఘురామకృష్ణమ రాజు తరఫు న్యాయవాదులు జైలు వద్ద వేచి చూశారు. రఘురామకృష్ణమ రాజును రమేష్ ఆస్పత్రికి తరలించాలని కోరారు. కానీ, కోర్టు ఆదేశాలు అందకపోవడంతో అది సాధ్యం కాలేదు. సోమవారం ఉదయమే న్యాయవాదులు తిరిగి జైలు వద్దకు వచ్చారు. అయితే, జిల్లా జైలు సూపరింటిండెంట్ ఉదయం 10.30 గంటలకు వస్తారు. 

ఆ సమయానికి సిఐడి అధికారులు కూడా రావాల్సి ఉంటుంది. రఘురామకృష్ణమ రాజును తరలించడానికి పోలీసు ఎస్కార్ట్ కూడా అవసరమవుతుంది. ఈ స్థితిలో సిఐడి అధికారులు, పోలీసులు, జైలు అధికారుల మధ్య సమన్వయం అవసరమవుతుంది. అందువల్ల రఘురామ కృష్ణమ రాజును రమేష్ ఆస్పత్రికి తరలించే విషయంలో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాతనే అది జరిగే అవకాశం ఉంది. 

Also Read: జగన్ బెదిరించారు, నా భర్తను జైల్లో చంపేస్తారు: రఘురామ భార్య రమాదేవి

అయితే, రఘురామకృష్ణమ రాజు ఆరోగ్యం సరిగానే ఉందని, వెంటనే ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదని సిఐడి అధికారులు చెప్పారు. ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే ఆస్పత్రికి తరలించి ఉండేవాళ్లమని వారంటున్నారు. రమేష్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలనే సిఐడి కోర్టు ఆదేశాలపై వేసిన రివ్యూ పిటిషన్ కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా, బెయిల్ కోసం రఘురామకృష్ణమ రాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కూడా సోమవారంనాడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

click me!