రఘురామపై థర్డ్‌ డిగ్రీ .... జగన్ సర్కార్‌పై చర్యలు తీసుకోండి: లోక్‌సభ స్పీకర్‌కు రామ్మోహన్ నాయుడు లేఖ

By Siva KodatiFirst Published May 16, 2021, 10:04 PM IST
Highlights

నర్సాపురం ఎంపీ, వైసీపీ తిరుగుబాటు నేత రఘురామకృష్ణంరాజు అక్రమ అరెస్టుపై లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై, అవినీతిపై గళం విప్పిన ఒక ఎంపీని ఒక సాధారణ క్రిమినల్ ను అరెస్టు చేసినట్లు చేశారని ఆయన మండిపడ్డారు

నర్సాపురం ఎంపీ, వైసీపీ తిరుగుబాటు నేత రఘురామకృష్ణంరాజు అక్రమ అరెస్టుపై లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై, అవినీతిపై గళం విప్పిన ఒక ఎంపీని ఒక సాధారణ క్రిమినల్ ను అరెస్టు చేసినట్లు చేశారని ఆయన మండిపడ్డారు.

జగన్, తన కోటరీపై మాట్లాడినందుకు రాజద్రోహం కేసుపెట్టి ఎంపీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని, నిరసన గళాన్ని అణచివేయడమేనని రామ్మోహన్ అన్నారు. మే 14వ తేదిన అరెస్టు అనంతరం రాజును గుంటూరు జిల్లా మంగళగిరిలోని సిఐడి ఆపీసుకు తీసుకొచ్చారని.. ఆ సమయంలో ఐదుగురు ముసుగు ధరించిన వ్యక్తులు థర్డ్ డిగ్రీ అమలు చేసి కస్టోడియల్ హింసకు పాల్పడ్డారని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. 

గతంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నుండి తనకు ప్రాణహాని ఉందని ఎంపీ రాజు ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటీషన్ నం. 1098/2020 ను ఫైల్ చేసి భధ్రత కల్పించాలని కోరారని.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు రఘురామకృష్ణంరాజుకు కేంద్ర హోంశాఖ వై-కేటగిరి భధ్రత కల్పించిందని టీడీపీ ఎంపీ గుర్తుచేశారు.

నిరాధారమైన ఆరోపణలతో ఎంపీ రాజును అరెస్టు చేయడం సభ హక్కుల ఉల్లంఘనే అని వైసీపీ ప్రభుత్వ చట్టవ్యతిరేక చర్యలతో ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడుతోందని రామ్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.  

Also Read:జగన్ ప్రభుత్వం నుంచి రఘురామకు ప్రాణహాని: గవర్నర్ కు చంద్రబాబు లేఖ

ఎప్.ఐ.ఆర్ నం.12/2021 తో రఘురామకృష్ణం రాజుతో పాటు న్యూస్ ఛానెళ్లైన ఏబిఎన్, టివి 5 లపై సెక్షన్ 505, 120బి ల క్రింద సైతం క్రిమినల్ కేసు నమోదు చేశారని.. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగం ప్రజలకు కల్పించిన భావప్రకటన స్వేచ్చను అణచివేస్తూ అక్రమ కేసులు బనాయిస్తోందని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.

కస్టోడియల్ హింస చట్టవ్యతిరేకమని గౌరవ సుప్రీంకోర్టు అనేకమార్లు ఉద్ఘాటించిందని.. జీవించే హక్కు ప్రతీ పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కు అని ఆయన లేఖలో ప్రస్తావించారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఆ హక్కును కాలరాస్తోందని.. ఎక్కడైనా అన్యాయం అనేది ప్రతిచోటా న్యాయానికి ముప్పు అవుతుందని మార్టిన్ లూథర్ కింగ్ చెప్పిన మాటలు ఆంధ్రప్రదేశ్ స్పష్టంగా కనిపిస్తున్నాయని రామ్మోహన్ నాయుడు అన్నారు.

రఘురామకృష్ణంరాజు ఘటన ఒక్కటే కాదని.. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో అనేకం చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. సహ పార్లమెంటు సభ్యులుగా రఘురామకృష్ణం రాజు పై చేస్తున్న కక్షసాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్లమెంటు సభ్యులపై ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తగిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ను రామ్మోహన్ నాయుడు కోరారు. 

click me!