రాజకీయ పెత్తనం నుండి దేవాలయాలకు విముక్తి...: బిజెపి ఎంపీతో శారదాపీఠం స్వాత్మానందేంద్ర భేటి

By Arun Kumar PFirst Published Sep 23, 2021, 12:24 PM IST
Highlights

ప్రస్తుతం దేశ రాజధాని న్యూడిల్లీలోనే వున్న స్వాత్మానందేంద్ర స్వామి బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఇంటికి వెళ్లి దేవాలయాలను ప్రభుత్వ పరిధినుండి తప్పిస్తే ఎదురయ్యే సవాళ్లు, పరిణామాల గురించి చర్చించారు.

న్యూడిల్లి: హిందూ దేవాలయాలపై రాజకీయ పెత్తనం లేకుండా వుండాలంటే ప్రభుత్వ ఆధీనంలో వుండే వాటికి స్వయంప్రతిపత్తి కల్పించాలన్న డిమాండ్ గతకొంతకాలంగి హిందూ ధార్మికసంస్థల నుండి వస్తోంది. ఇటీవల బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కూడా దేవాలయాలపై ప్రభుత్వ అజమాయిషీ లేకుండా వుండేలా పోరాడతానని ప్రకటించారు. ఇలా హిందూ దేవాలయాలను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలన్న పోరాటంలో విశాఖ శారదా పీఠం కూడా పాల్గొంటోంది. ఈ క్రమంలోనే దేవాలయాల విషయమై చర్చించేందుకు విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామితో భేటీ అయ్యారు. 

ప్రస్తుతం దేశ రాజధాని న్యూడిల్లీలోనే వున్న స్వాత్మానందేంద్ర స్వామి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా దేవాలయాలను ప్రభుత్వ పరిధినుండి తప్పిస్తే ఎదురయ్యే సవాళ్లు, పరిణామాల గురించి వారిద్దరు చర్చించారు. ప్రభుత్వాలు దేవాలయాలను తమ పరిధి నుండి తప్పిస్తే ఆ తర్వాత ఏం చేయాలి? ఎలాంటి సంస్థలు దేవాలయాల బాధ్యత చూస్తే బావుంటుంది? ఆలయ సాంప్రదాయాలు, ఆగమ నియమాల ప్రకారం దేవాలయాల బాధ్యత చేపట్టాలంటే ఎలాంటి అర్హతలు విధించాలి? వంటి పలు అంశాలపై స్వాత్మానందేంద్ర, సుబ్రహ్మణ్యస్వామి చర్చించుకున్నారు. 

తిరుమల తిరుపతి దేవస్థానం భవిష్యత్తులో చేపట్టాల్సిన ధార్మిక కార్యక్రమాలపైనా ఎంపీతో స్వాత్మానందేంద్ర స్వామి చర్చించారు. కోట్లాది రూపాయల ఆస్తులు కలిగిన శ్రీకాకుళం జిల్లా గుళ్ళ సీతారామపురం ఆలయ దుస్థితిని వివరించి.. దానిపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి చూపిస్తున్న శ్రద్ధ గురించి ఎంపీకి స్వామీజీ వివరించారు. 

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారా అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పించడంలో పీఠం తీసుకున్న చొరవ గురించి ఎంపీకి చెప్పారు. ఉత్తర భారతదేశానికి విశాఖ శారదాపీఠం కార్యకలాపాలను విస్తరించాలని... అందుకు తన  సహాయ సహకారాలు ఉంటాయని సుబ్రహ్మణ్య స్వామి ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర స్వామికి హామీనిచ్చారు.

click me!