బాబు పోలవరం టూర్: కీలక అధికారులు డుమ్మా

By narsimha lodeFirst Published May 6, 2019, 2:26 PM IST
Highlights

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పర్యటన సమయంలో కీలకమైన అధికారులు డుమ్మా కొట్టారు.  ఎన్నికల కోడ్ కారణంగానే అధికారులు చంద్రబాబు టూర్‌కు దూరంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది.


ఏలూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పర్యటన సమయంలో కీలకమైన అధికారులు డుమ్మా కొట్టారు.  ఎన్నికల కోడ్ కారణంగానే అధికారులు చంద్రబాబు టూర్‌కు దూరంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది.

ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో కూడ సాధారణ పరిపాలనను కొనసాగించేందుకు ఎలాంటి అడ్డంకులు కల్పించకూడదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెబుతున్నారు. అయితే గత మాసంలో చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు, సీఆర్‌డీఏ సమీక్షలను నిర్వహించడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ కాలేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల సమీక్షలను నిర్వహించిన విషయాన్ని కూడ పదే పదే చంద్రబాబునాయుడు ప్రస్తావించారు.  బిజినెస్ రూల్స్ కు విరుద్దంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని బాబు హెచ్చరికలు  జారీ చేశారు.

  ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ  కూడ  పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని తాను సందర్శిస్తానని చంద్రబాబునాయుడు ఆదివారం నాడు కూడ ప్రకటించారు. సోమవారం నాడు ఉదయం 10:40 గంటలకు పోలవరం ప్రాజెక్టు సైట్ వద్దకు బాబు చేరుకొన్నారు.

సుమారు మూడు గంటల పాటు ప్రాజెక్టు సైట్ వద్దే ఉండి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. బాబు పర్యటన సందర్భంగా నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్, సీఈలు మాత్రమే హాజరయ్యారు. కానీ, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి  శశిభూషణ్ మాత్రం పోలవరం ప్రాజెక్టు సమీక్షలో పాల్గొనలేదు.

మరోవైపు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు కూడ పోలవరం ప్రాజెక్టు సైట్ వద్దకు రాలేదు. బాబు పర్యటనను పురస్కరించుకొని అవసరమైన ఏర్పాట్లు చేసినప్పటికీ  ప్రాజెక్టు వద్దకు మాత్రం హాజరుకాలేదు.

గతంలోనే బాబు నిర్వహించిన సమీక్షకు హాజరైనందుకు గాను ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈ విషయమై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.  అయితే ఈ పరిణామాల నేపథ్యంలోనే కీలకమైన అధికారులు బాబు పర్యటనకు దూరంగా ఉన్నారనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

సంబంధిత వార్తలు

వచ్చే ఏడాది మే లోగా పోలవరం పూర్తి: చంద్రబాబు

 

click me!