
పీఆర్సీ (prc report) సహా సంబంధిత అంశాలపై ఉద్యోగ సంఘాలతో కార్యదర్శుల కమిటీ సమావేశం ముగిసింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో (joint staff committee) భాగస్వాములైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయం మొదటి బ్లాక్ లోని సీఎం సమావేశ మందిరంలో శుక్రవారం ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పీఆర్‌సీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరగా.. నివేదికలోని సాంకేతిక అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్‌సీ నివేదిక ఇవ్వలేమని అయితే సీఎం హామీ మేరకు పది రోజుల్లో పీఆర్‌సీ ప్రకటిస్తామని కార్యదర్శుల కమిటీ తెలిపింది. దీనిపై స్పందించిన ఉద్యోగ సంఘాలు పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా చర్చలెలా సాధ్యమని ప్రశ్నించారు. దీంతో కార్యదర్శుల కమిటీ సమావేశం అసంపూర్తిగానే ముగిసింది.
Also Read:ప్రారంభమైన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం: పీఆర్సీపై తేలేనా?
ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు (bandi sanjay) మీడియాతో మాట్లాడారు. 71 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మళ్లీ ఇచ్చామని ఆయన తెలిపారు. తిరుపతిలో (tirupathi) చెప్పిన విధంగా సీఎం (ys jagan) జోక్యం చేసుకోవాలని.. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సానుకూల స్పందన రాలేదని బండి చెప్పారు. ఏడో తేదీ నుంచి చేపట్టాలనుకున్న మా ఉద్యమ కార్యాచరణను కొనసాగిస్తామని.. పీఆర్సీతో పాటు మిగిలిన అంశాలు కూడా పరిష్కరించాలని కోరామని శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి విషయం రాకుండా ఎన్నిసార్లు సమావేశాలు పెట్టినా లాభం లేదని.. సంక్షేమ పథకాలు బాగా అమలు చేస్తున్నారు కానీ.. ఉద్యోగులకు అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు.
ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (bopparaju venkateswarlu) మాట్లాడుతూ.. పీఆర్సీ నివేదిక ఇస్తేనే మేం చర్చించగలమని స్పష్టంగా చెప్పామని ఆయన అన్నారు. పీఆర్సీ నివేదిక ఇవ్వకపోవడమే కాకుండా.. ఆ నివేదికలోని వివరాలను చెప్పడం లేదని బొప్పరాజు మండిపడ్డారు. పీఆర్సీ అంటే ఫిట్మెంట్ కాదని.. చాలా అంశాలు ఉంటాయనే విషయాన్ని ప్రభుత్వానికి స్పష్టం చేశామన్నారు. తిరుపతిలో పీఆర్సీ ప్రస్తావన చేశారు కాబట్టి పీఆర్సీ నివేదిక ఇస్తారనే ఆశతో వెళ్లామని.. అధికారుల దగ్గరైనా పీఆర్సీ నివేదిక ఉందా అన్న అనుమానం ఉందని బొప్పరాజు వ్యాఖ్యానించారు. అధికారులు చెప్పిన మాటలనే సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి కూడా చెప్పారని.. అంతకుమించి ఏం చెప్పలేదని వెంకటేశ్వర్లు మండిపడ్డారు.