విధుల్లో చేరుతా: హైకోర్టు తీర్పుపై నిమ్మగడ్డ రమేష్ కుమార్

By telugu teamFirst Published May 29, 2020, 12:22 PM IST
Highlights

హైకోర్టు తీర్పు మేరకు తాను వెంటనే విధుల్లో చేరుతానని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పించడం చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.

విజయవాడ: హైకోర్టు తీర్పుతో తాను విధుల్లో చేరుతానని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించడం సరికాదని హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. 

తాను నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తానని రమేష్ కుమార్ చెప్పారు. వ్యక్తులు శాశ్వతం కాదని, రాజ్యాంగం శాశ్వతమని ఆయన అన్నారు. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తానని ఆయన చెప్పారు.  

Also Read: జగన్ కు హైకోర్టు షాక్: ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డనే, ఆర్టినెన్స్ రద్దు

హైకోర్టు తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం అపీల్ కు వెళ్లదని భావిస్తున్నట్లు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. హైకోర్టు రాజ్యాంగ విలువలను కాపాడిందని అన్నారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు మరో టీడీపీ నేత అచ్చెన్నాయుడు చెప్పారు. 

స్థానిక సంస్థలను వాయిదా వేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత చంద్రబాబు చెప్పినట్లు రమేష్ కుమార్ పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని కుదిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దానికితోడు మాజీ న్యాయమూర్తి మాత్రమే ఎస్ఈసీగా అర్హులనే మరో ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది.

రమేష్ కుమార్ స్థానంలో హడావిడిగా కనగ రాజ్ ను ఎస్ఈసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కనగరాజ్ బాధ్యతలు కూడా స్వీకరించారు. ఆయన నియామకం చెల్లదని కూడా హైకోర్టు శుక్రవారంనాడు తీర్పు చెప్పింది.

click me!