
ఆంధ్రప్రదేశ్‌ను మరోమారు అంతర్జాతీయంగా నిలిపేందుకు తిరుపతిలో వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ ను వినియోగించుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
జనవరి 3 నుంచి 7 వ తేదీ వరకు జరగనున్న 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏర్పాట్లను ముఖ్యమంత్రి ఈ రోజు అధికారులు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో సమీక్షించారు. రాష్ట్రానికి మరోసారి జాతీయ, అంతర్జాతీయ అతిధులు వస్తున్నారని, మొత్తం 12 వేల మంది పాల్గొనే అతిపెద్ద కార్యక్రమం కొత్త ఏడాది ఆరంభంలో ఇదేనని అన్నారు.
సైన్స్ కాంగ్రెస్ నిర్వహణను కేవలం 5 రోజుల చర్చాగోష్ఠులతో సరిపెట్టకుండా రాష్ట్రంలోని సైన్స్ విద్యార్థులు, శాస్త్ర పరిశోధకులకు శాశ్వత ప్రయోజనం కలిగేలా ఒక విస్తృత కార్యక్రమానికి రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దీనికోసం విద్యావేత్తల నుంచి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
తక్షణ అవసరాల కోసం రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. సైన్స్ కాంగ్రెస్ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం వెంటనే తిరుపతిలో ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు
అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఇజ్రాయేల్, బంగ్లాదేశ్ నుంచి 9మంది నోబెల్ పురస్కార గ్రహీతలు సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా వస్తున్నారు. వీరికి కేంద్ర మంత్రులకు అమలుచేస్తున్న తరహాలోనే ప్రొటోకాల్ పాటించాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. అలాగే, మలేసియా, బంగ్లాదేశ్, ఐవోరీ కోస్ట్, శ్రీలంక, కెన్యా, మొజాంబిక్, జపాన్, సింగపూర్‌ల నుంచి సైంటిఫిక్ అసోసియేషన్ల ప్రతినిధులు వస్తున్నారు. ఇక జాతీయస్థాయిలో పేరొందిన 200 మంది జాతీయ పరిశోధన శాలలకు చెందిన శాస్త్రవేత్తలు, ఫ్యాకల్టీ మెంబర్లు, పరిశోధకులు, వివిధ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐసర్‌లకు చెందిన కులపతులు, ఆచార్యులు, అధ్యాపకులు మొత్తం 12 వేల మంది హాజరయ్యేందుకు సంసిద్ధత తెలిపారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.