స్పీకర్ ఎన్నికపై వైసీపీ, టీడీపీ మధ్య వాగ్యుద్దం

By narsimha lodeFirst Published Jun 13, 2019, 12:44 PM IST
Highlights

ఏపీ స్పీకర్‌గా ఎన్నికైన తమ్మినేని సీతారాం ను అభినందించే సమయంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ సభ్యుల మధ్య గురువారం నాడు అసెంబ్లీలో మాటల యుద్దం సాగింది.

అమరావతి: ఏపీ స్పీకర్‌గా ఎన్నికైన తమ్మినేని సీతారాం ను అభినందించే సమయంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ సభ్యుల మధ్య గురువారం నాడు అసెంబ్లీలో మాటల యుద్దం సాగింది.

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఎన్నికైనట్టు ప్రకటించిన వెంటనే ఆయనను స్పీకర్ స్థానం వరకు  తీసుకెళ్లి కూర్చొబెట్టే సమయంలో  టీడీపీ  తరపున అచ్చెన్నాయుడు , ఆ పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు మాత్రమే వెళ్లారు. విపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు మాత్రం వెళ్లలేదు.

సాధారణంగా స్పీకర్‌ను స్పీకర్ స్థానంలో కూర్చొబెట్టే సమయంలో సభా నాయకుడు, విపక్ష నాయకుడు కూడ  వెళ్తారు. అయితే సభలో చంద్రబాబునాయుడు ఉండీ కూడ రాలేదు. ఈ విషయమై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తన ప్రసంగంలో వివరణ ఇచ్చారు.

అధికార పక్షం సంప్రదాయాలను పట్టించుకోవడం లేదని  విమర్శించారు. స్పీకర్‌గా ఎవరిని ఎంపిక చేశారో కనీసం ప్రతిపక్ష సభ్యులకు సమాచారం ఇస్తారని ఆయన గుర్తు చేశారు. 

తమ్మినేని సీతారాం  పేరును స్పీకర్ పదవి కోసం ఎంపిక చేసినట్టుగా తమ పార్టీకి సమాచారం ఇవ్వలేదన్నారు.  మరో వైపు స్పీకర్‌గా ఎన్నికైన తమ్మినేని సీతారాంను స్పీకర్ స్థానంలో కూర్చొబెట్టే సమయంలో కనీసం విపక్షనేతను పిలువలేదని అచ్చెన్నాయుడు సభలో ప్రస్తావించారు. ఈ కారణంగానే  స్పీకర్ స్థానం లో తమ్మినేని సీతారాం ను   కూర్చొబెట్టే సమయంలో చంద్రబాబునాయుడు రాలేదని అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు.

అచ్చెన్నాయుడు మాటలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి  కౌంటరిచ్చారు. అధికారంలో ఉన్న సమయంలో  టీడీపీ ఏ మేరకు సంప్రదాయాలను పాటించిందని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. మీరు సంప్రదాయాలను పాటించకుండా ... తాము మాత్రం పద్దతి ప్రకారంగా సంప్రదాయాలను పాటించాలని కోరుకోవడం సరైందేనా అని ఆయన ప్రశ్నించారు.

టీడీపీ నేతలకు అబద్దాలు చెప్పడం అలవాటుగా మారిందన్నారు. నిజాలు చెబితే టీడీపీ నేతలకు ఇబ్బందులు ఏర్పడుతాయనే శాపం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిని స్పీకర్ పదవికి ఎంపిక చేస్తే కనీసం చైర్ వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టాలనే మర్యాదను కూడ చంద్రబాబునాయుడు పాటించలేదని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.


 

click me!